కర్ణాటక ఎన్నికలలో భాజపాకు తెలుగుదెబ్బ తప్పదా?

April 19, 2018


img

రెండు తెలుగు రాష్ట్రాలలో అనూహ్యమైన రాజకీయపరిణామాలు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ తెలంగాణాలో ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా, అక్కడ ఆంధ్రాలో ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు చేయనందుకు నిరసనగా అధికార ప్రతిపక్షపార్టీలన్నీ ఉద్యమబాటపట్టాయి. ఈ రెండు పరిణామాల వలన ఎక్కువగా నష్టపోయేది భాజపాయే. ఈ ప్రభావం మే 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టంగా కనిపించవచ్చు. ఎందుకంటే, కర్ణాటకలో సుమారు 55-65 లక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. కనుక వారి ఓట్లు చాలా కీలకం కానున్నాయి. 

మళ్ళీ ఒకసారి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తే, సిఎం కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటీవల బెంగళూరు వెళ్ళి దేవగౌడని కలిసి మాట్లాడిన తరువాత ఆయన కోరితే జెడిఎస్ కు మద్దతుగా కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ముస్లింల ఓట్లను ప్రభావితం చేయగల అసదుద్దీన్ ఓవైసీ కూడా జెడిఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. వారిరువురూ ప్రచారం చేస్తే కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారు, ముస్లిం ప్రజలు జెడిఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాని వలన కాంగ్రెస్, భాజపాలు రెండూ నష్టపోవడం ఖాయం. ఇక వారికి నటులు ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కూడా తోడయితే అందరూ కలిసి భాజపాను చావు దెబ్బతీయగలరు. 

ఏపిలో రాజకీయాలను పరిశీలిస్తే, ఏపికి కేంద్రం తీరని అన్యాయం చేసిందని అధికార, ప్రతిపక్షపార్టీలన్నీ ముక్తకంఠంతో వాదిస్తున్నాయి. కనుక కర్ణాటక ఎన్నికలలో తెలుగు ప్రజలు భాజపాకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నాయి. కర్ణాటకలో తమ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఏపి కాంగ్రెస్ నేతలు కర్ణాటక వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని చెపుతున్నారు. వారు ఏపికి భాజపా చేసిన అన్యాయం గురించి వివరిస్తే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చు. 

ఇక మోడీపై రగిలిపోతున్న చంద్రబాబు, తెదేపా నేతలు కూడా జెడియు లేదా మరేదైనా పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లయితే భాజపాకు మరింత నష్టం కలుగవచ్చు. కాంగ్రెస్, తెదేపా, వైకాపా నేతలు ప్రచారంలో పాల్గొనకపోయినా ఏపికి భాజపా అన్యాయం చేసిందనే వారి వాదనలు, నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు కర్ణాటకలో తెలుగు ప్రజలపై ఎంతో కొంత ప్రభావం చూపకమానవు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఈ రాజకీయపరిణామాలన్నీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం చూపి భాజపాకు ఎంతో కొంత నష్టం కలిగించడం ఖాయంగానే కనిపిస్తోంది. 


Related Post