మాట్లాడమంటే ఇలానా...మాట్లాడేది?

April 19, 2018


img

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కధువాలో ఎనిమిదేళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం, హత్యపై దేశంలో అనేక రాష్ట్రాలలో ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు, చిన్న పిల్లలపై నానాటికీ పెరిగిపోతున్న అత్యాచారాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడాన్ని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తప్పు పట్టారు. ఇప్పటికైనా మౌనం వీడి స్పందించాల్సిందిగా కోరారు. 

ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “అత్యాచారాలపై రాజకీయాలు చేయడం తగదు. ఇటువంటి సంఘటనల కారణంగా యావత్ దేశం తలదించుకోవలసివస్తోంది. మన కూతుర్లపై జరిగే ఈ లైంగికదాడులను సహించగలమా? అయితే గత ప్రభుత్వ హయాంలో అన్ని అత్యాచారాలు జరిగాయి...ఈ ప్రభుత్వ హయాంలో ఇన్ని అత్యాచారాలు జరిగాయి...అని పోల్చి చూసుకోవడం కూడా తప్పే. మన ఇంట్లో ఆడపిల్ల ఆలస్యంగా ఇంటికివస్తే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని నిలదీస్తుంటాము కానీ మగపిల్లలని మాత్రం ప్రశ్నించము. అత్యాచారాలు చేస్తున్నవారు ఎవరో ఒక తల్లితండ్రుల పిల్లలే.               అత్యాచారం అత్యాచారమే. దానిని అందరూ గట్టిగా ఖండిచాల్సిందే,” అని అన్నారు.

అయితే ప్రధానమంత్రి నుంచి దేశప్రజలు ఆశిస్తున్నది ఇటువంటి ప్రతిస్పందన కాదు. ఇటువంటి ప్రసంగాలు దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్టవేయలేవని అందరికీ తెలుసు. కనుక వాటికి అడ్డుకట్ట వేయడానికి తన ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొంటుందో ప్రధాని మోడీ చెపుతారని ప్రజలు ఆశిస్తారు. కానీ అత్యంత బాధాకరమైన, హేయమైన ఈ సంఘటనలపై ప్రధాని మోడీ తన సహజశైలిలో ఖండించడంతో సరిపెట్టేశారు. 

ఒక దేశ ప్రధాని ఈ సమస్యపై ఈవిధంగా స్పందిస్తే ఆయన క్రింద పనిచేసే మంత్రులు, అధికార యంత్రాంగం ఏవిధంగా పనిచేస్తుంది? ఇది ప్రధాని బాధ్యత కాదు పోలీసుల బాధ్యత కనుక చట్టం తన పని తాను చేసుకుపోతుందని సరిపెట్టుకొందామన్నా, దేశవ్యాప్తంగా నిత్యం మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలు ఆగడంలేదు కదా? ఆపలేకపోతున్నాము కనుక వారి కర్మకు వారిని వదిలేద్దాం...ఇవన్నీ మామూలే... అని చూసిచూడనట్లు అందరూ ఊరుకోవాలా? వీటికి ఎవరు జవాబుదారీగా ఉండరా? 


Related Post