ప్రజలు తరలివస్తారనే భయంతోనే..

April 19, 2018


img

టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం బుధవారం మహబూబ్ నగర్ లో పర్యటించినప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “మేము ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని బహిరంగ సభలు నిర్వహించుకొంటామంటే తెరాస సర్కార్ అనుమతించడం లేదు. ఎందుకంటే తెలంగాణా సాధన కోసం పోరాడిన మావైపు ప్రజలు ఎక్కడ ఆకర్షితులవుతారోననే భయంతోనే. తెరాస లాగే మాది ఉద్యమాల నుంచి పుట్టిన ఉద్యమపార్టీయే. కనుక మేము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా సాగాలని కోరుకొంటున్నాము. అదే చెపుతున్నాము కూడా. కానీ ఆవిధంగా జరగడం లేదు కనుక తెరాస సర్కార్ ను ప్రశ్నిస్తున్న మాగొంతులను బలవంతంగా నొక్కేయాలని ప్రయత్నిస్తోంది. మేము బహిరంగ సభలు పెట్టి వాస్తవాలు ప్రజలకు వివరిస్తే తెరాసకు ఇబ్బందికరంగా ఉంటుంది. మేము నిర్వహించే సభలకు బారీగా ప్రజలు తరలివస్తే రాష్ట్రంలో తెరాసకు వ్యతిరేకత పెరిగిందనే సంగతి బయటపడుతుంది. తెరాస సర్కార్ ఈ సంగతి గ్రహించబట్టే మా సభలకు అనుమతి నిరాకరిస్తోంది. అయితే ఒక రాజకీయపార్టీ బహిరంగ సభ నిర్వహించుకోవడానికి అనుమతించాలా వద్దా? అని నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఉండవచ్చు కానీ వాటికి రాజ్యాంగం కల్పించిన ఆ హక్కును ఏ ప్రభుత్వమూ కాదనలేదు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఏ రాజ్యాంగంపై ప్రమాణం చేశారో దానినే మరిచినట్లు ప్రవర్తిస్తున్నారిప్పుడు. ఇటువంటి ప్రజావ్యతిరేక, నిరంకుశధోరణులకు మన ప్రజాస్వామ్యవ్యవస్థలో చోటు లేదు. ఉండదు,” అని అన్నారు. 

టిజెఎస్ ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి అనుమతి నిరాకరించడం సరికాదని చెప్పకతప్పదు. రాజకీయంగా కూడా ఇది సరైన నిర్ణయమని చెప్పలేము. సభకు అనుమతి నిరాకరించడం గురించి ప్రొఫెసర్ కోదండరాం చెపుతున్న ఈ మాటలు తెరాసకు తీరని అప్రదిష్ట, నష్టం కలిగిస్తాయి. ప్రజలలో తెరాస సర్కార్ పట్ల వ్యతిరేకత పెరిగేలా చేస్తాయి. ప్రజలకు ప్రొఫెసర్ కోదండరాం పట్ల సానుభూతి ఏర్పడవచ్చు. 

కనుక టిజెఎస్ బహిరంగ సభ నిర్వహించుకొనిస్తే తెరాస సర్కార్ కు గౌరవంగా ఉండేది. అప్పుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పుకొంటున్నట్లు టిజెఎస్ కు నిజంగా అంత ప్రజాధారణ ఉందోలేదనే సంగతి కూడా తేలిపోటుంది కదా! అదీగాక...రేపు హైకోర్టు టిజెఎస్ సభ జరుపుకోవడానికి అనుమతిస్తే అది తెరాస సర్కార్ కే అవమానం. కనుక ప్రొఫెసర్ కోదండరాం సభ జరుపుకోవడానికి అనుమతించడమే అన్నివిధాల దానికి మంచిదని చెప్పవచ్చు.         



Related Post