దేశంలో మళ్ళీ రాచరికవ్యవస్థ ఏర్పడబోతోందా?

April 19, 2018


img

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాని కార్యదర్శి అజయ్ కల్లాం రాజకీయ పార్టీలు, వాటి తీరుపై చాలా ఆలోచించదగ్గ వ్యాఖ్యలు చేశారు. అయన వ్రాసిన ‘మేలుకొలుపు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఒకప్పుడు మన దేశంలో బలమైన రాచరిక వ్యవస్థ ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. కానీ క్రమంగా ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే మళ్ళీ రాచరిక వ్యవస్థ పుట్టుకొస్తోంది. ఇప్పుడు దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నిటిలో రాచరికవ్యవస్థ పోకడలే కనిపిస్తున్నాయి. పేరుకే ప్రజాస్వామ్యం కానీ అన్ని పార్టీలు అదే పద్దతిలో నడుస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యవ్యవస్థ మెల్లగా క్షీణిస్తోంది. కనుక దేశప్రజలందరూ కలిసి దానిని కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యపరచడానికే నేను ఈ పుస్తకం వ్రాశాను,” అని చెప్పారు. 

అజయ్ కల్లాం చెప్పింది అక్షరాల నిజమని అందరికీ తెలుసు. ఏ పార్టీని చూసినా అధికారం అధ్యక్షుడి చేతిలోనే కేంద్రీకృతం అయ్యుంటుంది. అతను చెప్పిందే వేదం. అతను చేసిందే శాసనం. అతను ఏమి చేస్తే అదే సరైనది. దానికి పార్టీలో, ప్రభుత్వంలో అందరూ వంతపడాలే తప్ప ఎవరూ అడ్డు చెప్పరాదు. ప్రశ్నించకూడదు. ఇక అతని స్థానంలో అతని కొడుకు లేదా కుటుంబ సభ్యులు తప్ప మరొకరు పదవులు చేపట్టకూడదు. చేపట్టలేరు. ఎప్పటికీ మేమే అధికారంలో ఉండాలి...ఉంటాము అని రాజకీయ పార్టీలు వాటి నేతలు చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. ఇవన్నీ రాజరికవ్యవస్థ లక్షణాలే. ఈ అవలక్షణాలు దేశంలో ఒక రాష్ట్రంలోనో లేక ఒక పార్టీలోనో ఉన్నాయంటే దానిని ప్రజలే సరిచేస్తారు. కానీ దాదాపు అన్ని పార్టీలలోను ఇవే అవలక్షణాలున్నాయి. ఇప్పుడు రాజులు, కిరీటాలు, రధాలు కనబడటం లేదు కానీ ఆ రాచరికపోకడలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారణాలు ఏవైతేనేమి వాటిని ప్రజలు కూడా ఆమోదిస్తున్నారిప్పుడు. కనుక భవిష్యత్ లో ఎన్నికలు, న్యాయవ్యవస్థలను రద్దయినా ఆశ్చర్యం లేదు. మళ్ళీ పూర్తిస్థాయిలో రాజులు, సామ్రాజ్యాలు ఏర్పడినా ఆశ్చర్యం లేదు.


Related Post