కెసిఆర్ బాటలోనే మజ్లీస్ కూడా..

April 16, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్...అయన ప్రభుత్వానికి గట్టి మద్దతుదారైనా మజ్లీస్ పార్టీ అయన అడుగుజాడలలోనే నడవాలనుకొంటే ఆశ్చర్యం లేదు. దేవగౌడకు చెందిన జెడిఎస్ ఆహ్వానిస్తే దాని తరపున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆయన బాటలోనే నడుస్తూ జెడిఎస్ కు మద్దతు ప్రకటించారు. మొదట కర్ణాటక ఎన్నికలలో మజ్లీస్ అభ్యర్ధులను నిలబెట్టాలనుకొన్న అసదుద్దీన్ ఇప్పుడు ఆ ఆలోచనను కూడా విరమించుకొన్నట్లు ప్రకటించారు. అంతేకాదు జెడిఎస్ ఆహ్వానిస్తే దాని తరపున తాము ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్దమని తెలిపారు. 

జెడిఎస్ కు స్వతహాగా కర్ణాటకలో కొంత బలముంది. అందుకే గత ఎన్నికలలో 40 సీట్లు సాధించగలిగింది. కానీ ఇంతకాలం ఇటువంటి గట్టి మద్దతు లభించకపోవడం వలననే అది కాంగ్రెస్, భాజపాలను ఓడించలేకపోతోంది. ఇప్పుడు తెరాస, మజ్లీస్ పార్టీల నుంచి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. పైగా జెడిఎస్ కు మద్దతుగా మజ్లీస్ పార్టీ బరిలో నుంచి తప్పుకొంది కూడా. 

మజ్లీస్ పోటీ చేసి ఉండి ఉంటే కర్ణాటకలోని ముస్లింలు కాంగ్రెస్ పార్టీని కాదని దానికే ఓట్లువేసి ఉండేవారు. మజ్లీస్ పార్టీ జెడిఎస్ కు మద్దతు ప్రకటించింది కనుక ఆ ఓట్లు జెడిఎస్ ఖాతాలో జమా అయ్యేఅవకాశం ఉంది. ఇక కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లయితే తెలంగాణాలో అమలవుతున్న సాగునీటి ప్రాజెక్టులు, రైతు, మహిళా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి కర్ణాటకలో తెలుగువారితో సహా కన్నడ ప్రజలను కూడా ఆకర్షించగలరు కనుక కెసిఆర్ ప్రచారం వలన జెడిఎస్ కు చాలా లబ్ది కలుగుతుందని చెప్పవచ్చు. 

ఈసారి ఎన్నికలలో భాజపాకు విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. ఈసమయంలో కెసిఆర్, అసదుద్దీన్ ఎన్నికల ప్రచారానికి వస్తే భాజపాకు ఇంకా నష్టం కలుగవచ్చు. వారిరువురి ప్రచారం వలన జెడిఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు సాధించుకోలేకపోయినా, కాంగ్రెస్, భాజపాల విజయావకాశాలను దెబ్బతీసి, జెడిఎస్ ‘కింగ్ మేకర్’గా మారే అవకాశం ఉంది. కనుక ఈ పరిణామాలు కాంగ్రెస్, భాజపాలను చాలా కలవరపరిచేవే!


Related Post