సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ లభిస్తాయా?

April 16, 2018


img

తెరాసలో 99 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 2019 ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ కేటాయిస్తామని సుమారు రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. వరుసగా మూడు సర్వేలు చేయించుకొన్నాక వచ్చే ఎన్నికలలో తెరాస కనీసం 106 సీట్లు గెలుచుకొంటుందని చెప్పారు. ఆ సర్వేలలో ప్రభుత్వం పనితీరుపట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని కనుక వారు తమ తీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. నిత్యం ప్రజల మద్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నవారికే టికెట్స్ కేటాయిస్తామని హెచ్చరించారు. టికెట్స్ కేటాయింపు విషయంలో కెసిఆర్ మొదట చెప్పినదానికి చివరిగా చెప్పిన దానికి స్పష్టమైన తేడా కనబడుతోంది. కనుక వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ లభించకపోవచ్చునని అర్ధం అవుతోంది. 

కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలని భావిస్తున్నారు. కనుక అయన చెప్పుకొంటున్నట్లుగా వచ్చే ఎన్నికలలో 106 సీట్లు గెలిచి రాష్ట్రంలో తన సత్తా చాటుకోవలసిన అవసరం ఉంది. కానీ ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే తెరాస ఎన్నికలకు వచ్చినట్లయితే వారిని కాంగ్రెస్ పార్టీ అవలీలగా ఓడించి అధికారం కైవసం చేసుకోగలమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు పట్ల ముఖ్యమంత్రి కెసిఆరే అసంతృప్తిగా ఉన్నప్పుడు వారితో ఎన్నికలకు వెళితే 106 సీట్లు సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అదీగాక ఇతర పార్టీలలో నుంచి వచ్చిన చేరిన నేతలు కూడా టికెట్స్ ఆశించడం సహజం. 2014 ఎన్నికలలో తెరాసకు అత్యంత అనుకూలమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉన్నపుడు కేవలం 63 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కానీ 2019ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు ఉండదు...పైగా వివిధ కారణాల చేత ప్రజలలో ఎంతో కొంత వ్యతిరేకత కూడా నెలకొని ఉందనేది వాస్తవం. దానిని గుర్తించినందునే తెలంగాణా జనసమితి (టిజెఎస్), బిఎల్ఎఫ్ కూటమి ఆవిర్భవించాయని చెప్పక తప్పదు.

పైగా వచ్చే ఎన్నికలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు జీవన్మరణ సమస్య వంటివి కనుక వారు తెరాసకు చాలా గట్టిపోటీనీయవచ్చు. ఇక భాజపా, తెదేపా, రెబెల్, స్వాతంత్ర్య అభ్యర్ధులు ఉండనే ఉన్నారు. ఈ నేపధ్యంలో తెరాస 106 సీట్లు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాబోదు. కానీ సాధించాలంటే పనితీరు బాగోలేనివారిని పక్కనపెట్టి గెలుపు గుర్రాలకి టికెట్స్ కేటాయించకతప్పదు. ఎంతమందిని పక్కన పెడతారనేది ఎన్నికలు దగ్గరపడితేగానీ తెలియదు. 


Related Post