మోడీ బాటలోనే చంద్రబాబు కూడా!

April 14, 2018


img

పార్లమెంటులో ప్రతిపక్షాలు అనుచితంగా వ్యవహరించినందుకు, దేశంలో విభజన రాజకీయాలు చేస్తునందుకు ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు, దేశవ్యాప్తంగా భాజపా నేతలు ఒక్కరోజు నిరాహార దీక్షలు చేశారు. అయితే అధికారంలో చేతిలో ఉంచుకొని కుంటిసాకులతో పార్లమెంటు సమావేశాలు నిర్వహించకుండా తప్పించుకొని పారిపోయి, మళ్ళీ ప్రతిపక్షాలను నిందించడం దేనికి?అని ఏపిసిఎం చంద్రబాబు నాయుడితో సహా ప్రతిపక్షపార్టీలన్నీ మోడీని, భాజపా నేతలను ప్రశ్నించారు. 

మోడీ నిరాహారదీక్ష చేస్తే తప్పు పట్టిన చంద్రబాబు నాయుడు, ఈ నెల 20వ తేదీన తన పుట్టిన రోజునాడు నిరాహారదీక్ష చేయబోతున్నట్లు ప్రకటించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం నమ్మకద్రోహం చేసినందుకు నిరసనగా నిరాహారదీక్ష చేస్తానని చెప్పారు. 

అయితే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుపై అవే ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించి ఏమీ చేయకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే చంద్రబాబు నాయుడు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. నాలుగేళ్ళు మోడీ, కేంద్రమంత్రులతో  రాసుకుపూసుకు తిరిగి, ఒకరినొకరు పొగుడుకొంటూ సన్మానాలు చేసుకొంటూ, ప్రత్యేకహోదా వద్దు ప్యాకేజీయే ముద్దు.. ‘ఆల్ ఈజ్ వెల్...ఆల్ ఈజ్ వెల్...’ అంటూ అవినీతిలో మునిగి తేలుతూ ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన వైఫల్యాలకు కేంద్రానికి ఆపాదించి, మోడీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి తను తప్పించుకోవాలని చూస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 

చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ నిలదీస్తుంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును నిలదీస్తున్నారు. విభజన తరువాత ఏపి రాష్ట్రం నాలుగేళ్ళలో మెల్లగా కోలుకొంటుందని అందరూ భావిస్తే, నేడు అంతకంటే దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏపి ప్రజలు ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.


Related Post