కేసిఆర్ ప్రశ్నకు భాజపా సమాధానం చెప్పగలదా?

March 20, 2018


img

రాష్ట్ర బడ్జెట్ పై శాసనసభలో చర్చ సందర్భంగా భాజపా ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి యధాప్రకారం తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రమని చెప్పుకొంటూనే తెరాస సర్కార్ రెండు లక్షల కోట్లు అప్పులు చేసిందని విమర్శించారు. 

కిషన్ రెడ్డి విమర్శలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఘాటుగా సమాధానం చెప్పారు. “ఈ బడ్జెట్ సమావేశాలలోనే అప్పుల గురించి మీరు అడిగిన ప్రశ్నలకు ఒకసారి నేను గణాంకాలతో సహా సవివరంగా సమాధానం చెప్పాను. అయినా మీరు మళ్ళీ అవే ఆరోపణలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో మా ప్రభుత్వం చేపడుతునన్ని అభివృద్ధి, సంక్షేమ పధకాలు ఏ బిజెపి పాలిత రాష్ట్రంలోనైనా చేపట్టారా? తెలంగాణా ధనిక రాష్ట్రమే అందులో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే ఇప్పటికిప్పుడు శాసనసభలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పధకాలకు ఒకేసారి రూ.25,000 పెంచగలిగాము. అలాగే కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతాలు ఇవ్వగలుగుతున్నాము. మరే రాష్ట్రంలోను చేయలేని విధంగా పంటరుణాలను మాఫీ చేశాము. ఒకేసారి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా చేపట్టగలుగుతున్నాము. అభివృద్ధి పనుల కోసం అప్పులు తీసుకోవడం తప్పు కాదు.

కేంద్రప్రభుత్వంతో సహా మీ బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ అప్పులు చేస్తున్నాయనే సంగతి మీకు తెలుసా? మన దేశమే కాదు...అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్ వంటిదేశాలు కూడా అవసరమైతే అప్పులు తెచ్చుకొంటాయి. అప్పులు తెచ్చుకోవడం తప్పు కాదు వాటిని సద్వినియోగం చేస్తున్నామా లేదా? చేసిన అప్పులన్నీ సకాలంలో తీరుస్తున్నామా లేదా అనేది ముఖ్యం. గత పదేళ్ళలో తెలంగాణా మీద ఖర్చుపెట్టిన దానికంటే నాలుగు రెట్లు ఈ మూడున్నరేళ్లలో ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నాము.

మేము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు మీ కంటికి కనిపించడం లేదా? మేము అమలుచేస్తున్న కెసిఆర్ కిట్స్ పధకాన్ని మీ బిజెపి పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కూడా అమలు చేస్తోంది. ఇరుగుపొరుగు రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకొని వాటిని ఆదర్శంగా తీసుకొని అమలుచేస్తుంటే, రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఈవిధంగా నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదు.

కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం ఈ రాజకీయాలకు ఎక్కడ నష్టపోతుందోనని భయపడుతున్నాను. మీరు నోటికి వచ్చిన విమర్శల చేయడం కంటే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలని కోరుకొంటున్నాను. హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి గురించి మీరు చేసిన విమర్శలను మేము నిర్మాణాత్మకమైన సలహాగానే స్వీకరించి మీరు చెప్పిన ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. కనుక రాజకీయాలు పక్కన బెట్టి అందరూ నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలి,” అని అన్నారు.


Related Post