పాపం తెదేపా!

March 20, 2018


img

ఏపిలో తెదేపా పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలాగ తయారైంది. నాలుగేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పని పూర్తి చేయలేక చేతులెత్తేసింది. అయితే తన వైఫల్యాలను అంగీకరిస్తే వచ్చే ఎన్నికలలో ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంది కనుక కేంద్రంపై ఆ నిందవేసి తప్పించుకొనే ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రజలకు కూడా అసలు సంగతి తెలుసు కనుక వారిని తనవైపు తిప్పుకొనేందుకు అటకమీద నుంచి ప్రత్యేకహోదా సెంటిమెంట్ ను కిందకు దింపి దాంతో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం డ్రామా మొదలుపెట్టింది. కానీ ఇంతకాలంగా తమకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ హటాత్తుగా ఊడిపడి, చంద్రబాబు సర్కార్ అవినీతిలో మునిగితేలుతోందని విమర్శలు గుప్పిస్తుండటంతో తెదేపా నేతలు షాక్ అయ్యారు. 

పవన్, జగన్ ఇద్దరూ భాజపా కోవర్టులని ముద్రవేసి, నష్ట తీవ్రతను తగ్గించుకొనే ప్రయత్నాలు చేస్తోంది కానీ వారిరువురూ ఇంకా చెలరేగిపోతూనే ఉన్నారు. అటు కేంద్రం, ఇటు మిత్రపక్షం, ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు అందరూ తమనే వేలెత్తి చూపుతుండటంతో ఏమి చేయాలో పాలుపోక కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రంలో తెదేపా నేతలు, కార్యకర్తలు అందరూ సైకిల్ యాత్రలు చేయాలని తెదేపా పిలుపునిచ్చింది. 

ఈ సమయంలో తెదేపా తమ్ముళ్ళ దృష్టి హటాత్తుగా సినీ పరిశ్రమపై పడింది. వారి మద్దతు పొందగలిగితే, సమస్య తీవ్రత తగ్గుతుందని భావించినట్లున్నారు. అందుకే తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ సినీ పరిశ్రమలోని పేదలను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్నప్పటికీ సినీపరిశ్రమలో వారు తమకు పట్టనట్లు కూర్చోన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే తమిళనాడులో అయితే ఏ చిన్న సమస్య వచ్చినా యావత్ తమిళ సినీ పరిశ్రమ కదిలివస్తుందని అన్నారు. ఏపి సమస్యల పరిష్కారానికి తెరాస కూడా సంఘీభావం తెలుపుతుంటే, హైదరాబాద్ లోనే ఉన్న తెలుగు సినీ పరిశ్రమలోనివారు ఎందుకు మద్దతు తెలుపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగు సినీ పరిశ్రమలోని పెద్దలు ముందుకు రాకపోతే తెలుగుప్రజలు వారి సినిమాలను వెలివేస్తారని హెచ్చరించారు. 

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ చేసింది విజ్ఞప్తి కాదు. హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఒంటరిగా మిగిలిపోయిన తెదేపాకు సినీ పరిశ్రమలోని వారు అండగా నిలబడకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నట్లు చెప్పవచ్చు. కానీ నాలుగేళ్ళు కేంద్రాన్ని పొగుడుతూ కాలక్షేపం చేసేసి ఇప్పుడు హటాత్తుగా జ్ఞానోదయం అయినట్లు భాజపాతో తెగతెంపులు చేసుకొని, కేంద్రంపై యుద్ధం ప్రకటించేసి అందరూ తనతో కలిసి రావాలని తెదేపా డిమాండ్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 


Related Post