అవిశ్వాసంపై తెరాస కుప్పిగంతులు దేనికంటే?

March 20, 2018


img

మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తెదేపా, వైకాపాలు లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇస్తామని ప్రకటించిన తెరాస, అవి సభలో చర్చకు రాకుండా అడ్డుకొంటూ ద్వందవైఖరిని ప్రదర్శిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. భువనగిరి తెరాస ఎంపి బూర నర్సయ్య కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మాటలు దీనిపై తెరాస వైఖరిని స్పష్టం చేశాయి. 

ఈరోజు ఆయన డిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ, “అవిశ్వాస తీర్మానం అంటే చిన్న పిల్లలాడుకొనే ఆట కాదు. మా కారణంగా అవిశ్వాస తీర్మానాలు చర్చకు రావడం లేదని మమ్మల్ని నిందించడం దేనికి?       దానిని ప్రవేశపెట్టే ముందు ఆ రెండు పార్టీలు మా మద్దతు కావాలని కోరలేదు. అయినా పక్కింట్లో పెళ్ళి జరుగుతుంటే మా ఇంట్లో రంగులు వేసుకోవలసిన అవసరం లేదు. మా రాష్ట్రానికి సంబందించిన రిజర్వేషన్ల సమస్యపై మేము పార్లమెంటులో పోరాడటం తప్పు కాదు కదా?” అని అన్నారు. 

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని ప్రకటించినప్పుడే ముఖ్యమంత్రి కెసిఆర్ దానిని ‘పిల్ల చేష్ట’ గా కొట్టిపడేశారు. నేడు బూర నర్సయ్య కూడా అదే చెప్పారు. అంటే అవిశ్వాస తీర్మానాలకు తెరాస మద్దతు ఈయలనుకోవడంలేదని స్పష్టం అవుతోంది. 

అయితే ఇదే ముక్క తెరాస స్పష్టంగా చెప్పవచ్చు. కానీ, ఆవిధంగా చేస్తే మోడీ-కెసిఆర్ మద్య రహస్య అవగాహన ఉందని, ఆ కారణంగానే తెరాస అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి ఇష్టపడటం లేదనే కాంగ్రెస్ వాదనలు దృవీకరించినట్లవుతుంది. 

కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సిద్దమవుతున్నప్పుడు ఇటువంటి ప్రచారం కెసిఆర్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. కనుక అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇస్తామని చెపుతూనే, అవి సభలో చర్చకు రాకుండా అడ్డుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా అదే చేపుతున్నారు. తెరాస ఎంపిలు గందరగోళం సృష్టిస్తూ సభలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టకుండా అడ్డుపడుతూ మోడీ సర్కార్ కు లోపాయికారిగా సహకరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. వారి వాదనలు నిజమేనని తెరాస ఎంపి బూర నర్సయ్య మాటలు స్పష్టం చేస్తున్నాయి. 

అయితే ఈ సందర్భంగా తెరాస, భాజపాలను ఒక ప్రశ్న అడగక తప్పదు. 

కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సిద్దమవుతున్నప్పుడు, ఈ అవకాశాన్ని వినియోగించుకొని తాను నిజంగానే మోడీ సర్కార్ ను గట్టిగా వ్యతిరేకిస్తున్నానని దేశప్రజలకు స్పష్టమైన సంకేతం ఇచ్చే ప్రయత్నం చేయకుండా తన విశ్వసనీయతను ఎందుకు ప్రశ్నార్ధకంగా మార్చుకొంటున్నారు?

మోడీ సర్కార్ కు లోక్ సభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు తెదేపా, వైకాపాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొని గట్టిగా జవాబు చెప్పడానికి ఎందుకు భయపడుతోంది? తద్వారా ఏపి ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళుతున్నాయో గ్రహించిందా లేదా? ఏది ఏమైనప్పటికీ, ఏపికి ప్రత్యేకహోదా అనేది అన్ని పార్టీలు ఒక రాజకీయ అస్త్రంగా వాడుకొంటున్నాయి తప్ప వేటికీ దానిని సాధించాలనే తపన, చిత్తశుద్ధి లేదని చెప్పక తప్పదు.


Related Post