అక్కడ ఫ్రంట్ ఇక్కడ బిఎల్ఎఫ్

March 20, 2018


img

దేశానికి స్వాత్రంత్రం వచ్చినప్పటి నుంచి పాలిస్తున్న కాంగ్రెస్, భాజపాల వలన దేశానికి ఒరిగిందేమీలేదని, అవి రెండూ ఒకే నాణేనికి బొమ్మ బొరుసువంటివని ముఖ్యమంత్రి కెసిఆర్ చెపుతున్నారు. కనుక జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పును తీసుకువచ్చేందుకు ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

కాంగ్రెస్, భాజపాల పాలనను కెసిఆర్ వేలెత్తి చూపిస్తుంటే, రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలు అయన పాలనను వేలేత్తి చూపుతున్నాయి. నిరంకుశత్వం, అప్రజాస్వామిక , ప్రజా వ్యతిరేక విధానాలు, కుటుంబపాలన, మాటలకే పరిమితమవుతున్న హామీలను, ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు ఏకరువు పెడుతున్నాయి. 

ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు బలహీనపడినందున, రాష్ట్ర రాజకీయాలలో శూన్యత ఏర్పడిందని భావిస్తూ దానిని భర్తీ చేయడానికి సిపిఎం నేతృత్వంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) ఏర్పాటయిన సంగతి అందరికీ తెలిసిందే. 

ఫెడరల్ ఫ్రంట్ గురించి మమతా బెనర్జీతో చర్చలకోసం కెసిఆర్ నిన్న కోల్ కతా వెళ్ళినప్పుడే, హైదరాబాద్, గోల్కొండ చౌరస్తా సమీపంలో బిఎల్ఎఫ్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు మాట్లాడుతూ, కాంగ్రెస్, భాజపాల పాలన గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో, వారు కూడా తెరాస పాలనపై అటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం. వచ్చే ఎన్నికలలో తెరాసను గద్దె దించితే తప్ప రాష్ట్రం బాగుపడదని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు న్యాయం జరుగదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. బిఎల్ఎఫ్ కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా అవతరించాలని అన్నారు.

మోడీ సర్కార్ విధానాలను వేలెత్తి చూపుతున్నందుకు రాష్ట్ర భాజపా నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగానే, తెరాస సర్కారు ను వేలెత్తి చూపుతున్నందుకు తెరాస  నేతలు బిఎల్ఎఫ్ నేతలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు.

కెసిఆర్ ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్ లో ఎన్ని పార్టీలు చేరుతాయో ఇంకా అప్పుడే తెలియదు కానీ దానిలో చేరేవాటికి ఆయా రాష్ట్రాలలో ఎంతో కొంత బలం ఉంటుంది కనుక వచ్చే ఎన్నికల నాటికి ఫెడరల్ ఫ్రంట్ సిద్దమయితే అది తప్పకుండా కాంగ్రెస్, భాజపాల విజయావకాశాలను దెబ్బ తీయడం ఖాయమనే భావించవచ్చు. కానీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన బిఎల్ఎఫ్ లో భాగస్వాములుగా ఉన్న పార్టీలకు ప్రజలలో పెద్దగా గుర్తింపు లేదు కనుక వచ్చే ఎన్నికలలో బిఎల్ఎఫ్ తెరాసకు పెద్దగా నష్టం కలిగించలేకపోవచ్చు. బహుశః ఆ ధీమాతోనే తెరాస నేతలు ఎవరూ బిఎల్ఎఫ్ ను పెద్దగా పట్టించుకోవడంలేదని చెప్పవచ్చు. కానీ మోడీ పాలన పట్ల అసంతృప్తి కారణంగానే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లే, కెసిఆర్ పాలన పట్ల కూడా రాష్ట్ర ప్రజలలో అసంతృప్తి ఉందని గుర్తించినందునే బిఎల్ఎఫ్ ఏర్పాటు అయ్యిందనే విషయం తెరాస నేతలు మరిచిపోకూడదు. 


Related Post