గ్రామాభివృద్ధి కోసం స్వంత భూమి అమ్మకం!

March 20, 2018


img

రాజకీయ నేతలు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తారని వింటాము కానీ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం స్వంత భూములను అమ్ముకోవడం ఎవరూ ఎన్నడూ విని ఉండరు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ జెడ్.పి.టి.సి. చింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి అందుకు సిద్దపడ్డారు. ఆమె 2014లో జరిగిన జెడ్.పి.టి.సి. తెరాస తరపున పోటీ చేసి గెలిచారు. అందరు అభ్యర్ధులలాగే ఆమె కూడా తాను గెలిస్తే చేవెళ్ళ మండలంలో గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసిచూపుతామని హామీ ఇచ్చారు. ఆమె అధికార పార్టీకి చెందినవారే కనుక ప్రభుత్వం చాలా ఉదారంగా నిధులు విడుదల చేస్తుందని ఆశించారు. కానీ విడుదల కాకపోవడంతో ఆమె స్థానిక ఎంపి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల వద్ద మోరపెట్టుకొన్నారు. అయినా ఫలితం కనిపించలేదు. సీనరేజి నిధుల విడుదల కోసం ఆమె హైకోర్టులో పిటిషన్ వేసి పోరాటం చేశారు కూడా. హైకోర్టు ఆదేశాలమేరకు చేవెళ్ళకు నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ నాలుగేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు నిధులు విడుదలకాలేదు. 

తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విసుగెత్తిపోయిన శైలజ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి హైదరాబాద్-బీజాపూర్ హైవే పక్కనే ఉన్న తన స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. దానికోసం ఆమె అక్కడ ఒక ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేశారు. దానిలో తన భూమి అమ్మడానికి గల కారణాలు వివరించి, చేవెళ్ళ మండలం అభివృద్ధి కోసం తన భూమిని ఎవరైనా మంచిధరకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి ఎవరైనా ఈవిధంగా చేసి ఉండి ఉంటే, తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలుజేసేందుకే చేస్తున్నారని తెరాస నేతలు ఆరోపించవచ్చు. కానీ తెరాసకు చెందిన జెడ్.పి.టి.సి.యే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని చెపుతూ, తన భూమిని అమ్మకానికి పెట్టడం వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతోంది. మరి దీనికి తెరాస నేతలు ఏమి సమాధానం చెపుతారో? లేదా ఆమెపై ఎదురుదాడి చేసి ఆమె నోరు మూయిస్తారో చూడాలి. 


Related Post