మోడీ వ్యతిరేకతే ప్లీనరీ అజెండా?

March 20, 2018


img

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా డిల్లీలో చాలా అట్టహాసంగా మూడు రోజులపాటు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. వాటికి దేశంలో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి సీనియర్ నేతలందరూ చాలా ఆవేశంగా మాట్లాడారు. 

అయితే మూడురోజుల ప్లీనరీ సమావేశాల సారాంశం ఏమిటంటే, ‘మోడీ హయంలో దేశంలో అసహనం పెరిగిపోతోంది. ఆ కారణంగా ప్రజలలో నానాటికీ మోడీ పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది. దానిని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకొని 2019 ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలి.’ ప్లీనరీలో మాట్లాడిన కాంగ్రెస్ నేతలందరూ ఇంచుమించు ఇదే విషయం వేర్వేరుగా చెప్పారు. అంతే తప్ప పదేళ్ళపాటు దేశాన్ని పాలించిన తమను ప్రజలు 2014 ఎన్నికలలో ఓడించారు. అప్పటి నుంచి జరుగుతున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతోంది? పార్టీ విధానాలలో లోటుపాట్లు ఏమిటి? వాటిని ఏవిధంగా సవరించుకొని ముందుకు వెళ్ళాలి? దేశప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్పడానికి బలమైన కారణాలు ఏమున్నాయి? అని ఎవరూ ఆత్మావలోకనం చేసుకోలేదు. మోడీ ప్రభుత్వం పట్ల దేశప్రజలలో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే చాలు..అధికారం చేజిక్కించుకోవచ్చుననే భ్రమలో మునిగితేలారు. 

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే, ఇటువంటి మూస ఆలోచనలు లేదా విధానాల నుంచి పార్టీని బయటకులాగి దేశప్రజల ఆకాంక్షల మేరకు పార్టీని నడిపిస్తారనే వాదన మొదట్లో వినబడేది. కానీ ఈ ప్లీనరీ సమావేశాలను చూసిన తరువాత అయన కూడా ఆ మూస విధానాలను కొనసాగించబోతున్నారని స్పష్టం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ విధానాలలో ఎటువంటి మార్పు లేనప్పుడు మరి 2019 ఎన్నికలలో దేశప్రజలు మళ్ళీ దానికి ఎందుకు ఓటు వేయాలి? వేస్తే మళ్ళీ అదే అవినీతి, అసమర్ధత, అక్రమాల పాలనను కొని తెచ్చుకొన్నట్లే కదా? 


Related Post