అది తమ్మినేని చెప్పాలా?

March 17, 2018


img

సిపిఎం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) కూటమి 2019 ఎన్నికలో కాంగ్రెస్, తెరాసలతో ఎన్నికల పొత్తులు పెట్టుకాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ప్రాంతీయపార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు, అవసరాలు, లాభాలే ప్రాతిపదికన పనిచేస్తుంటాయని వాటికి విశాల దృక్పధం ఉండదని అన్నారు. అది తెరాసను ఉద్దేశ్యించి అన్నమాటలేనని వేరే చెప్పనక్కరలేదు. తెరాస, కాంగ్రెస్, భాజపాలు వేర్వేరు పార్టీలేగానీ అవన్నీ ఒకేలా పనిచేస్తుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటికి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక కూటమిని ఏర్పాటుచేయడానికి కృషి చేస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. జనసేన పార్టీ బిఎల్ఎఫ్ కూటమిలో చేరే అవకాశం ఉందన్నారు. 

బిఎల్ఎఫ్ అంటే 28 ప్రాంతీయ పార్టీలతో కూడిన కూటమి. తెరాస పాలనను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేయబడింది. అటువంటప్పుడు, ప్రాంతీయ పార్టీలు సంకుచితంగా వ్యవహరిస్తాయని కనుక ప్రాంతీయ పార్టీ అయిన తెరాసతో పొత్తులు పెట్టుకోమని తమ్మినేని వీరభద్రం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెరాసను ప్రాంతీయ పార్టీ అంటున్న తమ్మినేని ప్రాంతీయ పార్టీ అయిన జనసేనతో పొత్తులు పెట్టుకోవాలనుకొంటున్నట్లు చెప్పడం విశేషం. అయినా వచ్చే ఎన్నికలలో తెరాస ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా పోటీ చేస్తుందని, 106 సీట్లు గెలుచుకొంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా తెరాస నేతలు అందరూ పదేపదే చెపుతున్నప్పుడు తెరాసతో పొత్తులు పెట్టుకోబోమని తమ్మినేని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. దశాబ్దాలుగా జాతీయపార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు తోకపార్టీలాగ మిగిలిపోయిన సిపిఎం, రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో తామే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని చెప్పుకోవడం చూస్తే ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురతానన్నట్లుంది. సిపిఎం ఏర్పాటు చేసిన ఈ కూటమిలో చేరడానికి భావస్వారూప్యత కలిగిన సిపిఐ అయిష్టత వ్యక్తం చేస్తోంది.  ప్రాంతీయ పార్టీలన్నీ తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు, అవసరాలు, లాభాలే ప్రాతిపదికన పనిచేస్తాయని తమ్మినేనే చెపుతున్నారు. మరి అటువంటివాటితో ఏర్పడిన బి.ఎల్.ఎఫ్ కూటమికి ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎందుకు ఓటేయాలి?


Related Post