అందుకే డిల్లీ వచ్చాను: కోమటిరెడ్డి

March 17, 2018


img

నల్గొండ జిల్లాలో తనకు తిరుగులేదని గట్టి నమ్మకంతో ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తే ఉపఎన్నికలలో లోక్ సభకు పోటీ చేసి గెలిచి తన సత్తా చాటుకోవాలని తహతహలాడారు. కానీ శాసనసభలో గవర్నర్ నరసింహన్ పైకి హెడ్ ఫోన్స్ విసిరి తెరాసకు అడ్డంగా దొరికిపోయారు. తెరాస వికెట్ పడగొట్టాలనుకొని చేజేతులా తన వికెట్ తనే పడగొట్టుకొని క్లీన్ బౌల్డ్ అయ్యారు. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న తెరాస అధినేత కెసిఆర్ చాలా చురుకుగా పావులు కదిపి, తన పార్టీలో ఎవరూ రాజీనామాలు చేయనవసరం లేకుండానే నల్గొండ జిల్లాలో ఉపఎన్నికలు వచ్చేలా చేయగలిగారు. దీంతో కంగు తిన్న కాంగ్రెస్ నేతలు చేస్తున్న హడావుడి అందరూ చూస్తూనే ఉన్నారు. 

ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఉపఎన్నికలు వస్తే అయన తన పదవికి రాజీనామా చేసి పోటీ చేసి ఉండేవారు కానీ ఇప్పుడు తన పదవి కోల్పోవడం వలననే ఉపఎన్నికలను ఎదుర్కోవలసి రావడం అయన జీర్ణించుకోవడం కష్టమే. అందుకే అయన కెసిఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం అవుతున్నారు. 

48 గంటల నిరాహార దీక్ష పూర్తికాగానే అయన హడావుడిగా డిల్లీ చేరుకొన్నారు. ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ చేస్తున్న దోపిడీ గురించి సిబిఐ, ఈడిలకు పిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. నలుగురు ఆంధ్రా కాంట్రాక్టర్లకు రూ.1.40 లక్షలు కాంట్రాక్టులు కట్టబెట్టి కెసిఆర్ కుటుంబ సభ్యులు బారీగా కమీషన్లు తీసుకొన్నట్లు తన వద్ద బలమైన ఆధారాలున్నాయని, వాటిని సిబిఐ, ఈడిలకు సమర్పించబోతున్నానని చెప్పారు. కెసిఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించకుండా విడిచిపెట్టనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.  

అయితే ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత మా కుటుంబ సభ్యులందరం కలిసి ఒక తీర్మానం చేసుకొన్నాము. ‘మనకు సరిపడేంత ఆస్తులున్నాయి కనుక కుటుంబంలో ఎవరూ అవినీతి, అక్రమాలకు పాల్పడకూడదని తీర్మానం చేసుకొన్నాము. నేటికీ మేమందరం ఆ తీర్మానానికి కట్టుబడే ఉన్నాము. నా జేబులో ఉన్న పెన్నుతో సహా ప్రతీ పైసాకు లెక్కలున్నాయి. అలాగే నా కుటుంబ సభ్యులందరూ కూడా అణాపైసలతో సహా ఆదాయపన్ను శాఖకు లెక్కలు సమర్పిస్తున్నాము. కనుక మాపై ఎవరు ఎన్ని కేసులు వేసుకొన్నా మాకు భయం లేదు. మాపై బురద జల్లలని ప్రయత్నించినవారికే ఆ బురద అంటుకొంటుంది,” అని అన్నారు. కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆరోపణలలో నిజమెంతో కాలమే చెపుతుంది. 


Related Post