ఎన్డీయేకు తెదేపా గుడ్ బై!

March 16, 2018


img

తెదేపా, భాజపాల మద్య ఉన్న ఆఖరి బంధం కూడా ఈరోజు తెగిపోయింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్లు తెదేపా ప్రకటించింది. ఈరోజు ఏపి అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కనుక ఇకపై తెదేపా నేతలు భాజపాపై యుద్ధం ప్రకటించవచ్చు. కనుక ఏపి భాజపా నేతలు కూడా తెదేపాతో యుద్ధం మొదలుపెట్టడానికి కత్తులు నూరుతున్నారు. 

ఇక తెదేపా-భాజపా తెగతెంపులు చేసుకొని కేంద్రంపై విమర్శలు చేస్తుండటంపై తెలంగాణా భాజపా నేతలు కూడా స్పందిస్తున్నారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రం ఎంత సహాయసహకారాలు అందిస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయిన చంద్రబాబు సర్కార్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టారు,” అన్నారు. 

భాజపా జాతీయ అధికార ప్రతినిధి నరసింహారావు మాట్లాడుతూ, “ఈ నాలుగేళ్ల కాలంలో తెదేపా సర్కార్ ఏమీ చేయకపోవడం వలన వచ్చే ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ బాబు డ్రామాలను ఏపి ప్రజలు నమ్మరు,” అని అన్నారు.

భాజపా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, “2014 ఎన్నికలలో దేశవ్యాప్తంగా మోడీ హవా నెలకొని ఉందని గుర్తించినందునే చంద్రబాబు మా పార్టీతో పొత్తులు పెట్టుకొన్నాడు. ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే  మాతో తెగతెంపులు చేసుకొన్నారు. కానీ మాతో తెగతెంపులు చేసుకొని తెదేపా మా నెత్తిన పాలుపోసింది. ఇక ఆంధ్రాలో మాపార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏ అడ్డంకు ఉండదు,” అని అన్నారు.         



Related Post