కాంగ్రెస్ సభ్యులపై వేటు! ఎవరిది తప్పు?

March 13, 2018


img

ప్రజా ప్రతినిధులు చట్టసభలలో హుందాగా ప్రవర్తిస్తూ ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. కానీ చట్టసభలను రాజకీయవేదికలుగా భావిస్తూ చాలా హేయంగా ప్రవర్తిస్తున్నారు.     గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించిన మాట వాస్తవం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ పైకి హెడ్ సెట్ విసిరి మరో పెద్ద తప్పు చేశారు. అది క్షమించరాని నేరమే. కనుక తెరాస సర్కార్ కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి, మిగిలినవారిని సభ నుంచి సస్పెండ్ చేసింది. 

అయితే వారి విషయంలో ప్రభుత్వం కూడా తొందరపాటుగానే వ్యవహరించిందని చెప్పకతప్పదు. శాసనసభ్యులపై అంత తీవ్రమైన చర్యలు తీసుకొనే ముందు వారిని సంజాయిషీ కోరి ఉంటే బాగుండేది లేదా వారిని గట్టిగా హెచ్చరించి ఒకరోజు సస్పెండ్ చేసి ఉన్నా ఎవరూ వేలెత్తి చూపగలిగేవారు కారు. కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, తమ ప్రభుత్వాన్ని విమర్శించడానికి చేజేతులా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. 

మళ్ళీ అటువంటి తప్పు చేయడానికి ఎవరూ సాహసించకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం వారిపట్ల అంత కటినంగా వ్యవహరించిందని తెరాస నేతలు సమర్ధించుకొంటున్నారు. దానికోసమే అయితే ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే బదులు, సభలో అనుచితంగా వ్యవహరించినవారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో విధివిధానాలు రూపొందించి ఉంటే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభించేది కదా! 

ఇక కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరూ శాసనసభలో అనుచితంగా ప్రవర్తించి మళ్ళీ నిరాహార దీక్షలు చేయడం సిగ్గుచేటు. పైగా అందరూ తమకు మద్దతు ఇవ్వాలని కోరడం ఇంకా విచిత్రంగా ఉంది. శాసనసభలో అందరూ హుందాగా వ్యవహరించాలని నిత్యం సుద్దులు చెప్పే జానారెడ్డి, తన పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు అదే మాట ఎందుకు చెప్పలేకపోయారో ఆయనకే తెలియాలి. వారి అనుచిత వైఖరిని అయన ఏవిధంగా సమర్ధించుకొంటారు? కనీసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిరాహార దీక్ష చేయవద్దని అయన వారించలేకపోయారు. 

ఈ వ్యవహారంలో కాంగ్రెస్, తెరాస రెండూ అత్యుత్సాహం ప్రదర్శించాయని చెప్పకతప్పదు. కీలకమైన బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్షాలు లేకుండా ఏకపక్షంగా చర్చించి ఆమోదించుకోవడం తెరాస సర్కార్ కూడా అంత గౌరవప్రదం కాదు. కనుక ఇరు పార్టీల నేతలు వెనక్కు తగ్గి ఈ సమస్యకు ఇక్కడితో ముగింపు పలికి బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహిస్తే అందరికీ గౌరవంగా ఉంటుంది.


Related Post