టి-కాంగ్రెస్ సంచలన నిర్ణయం

March 13, 2018


img

శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరినీ సస్పెండ్ చేయడం, ఎమ్మెల్యేలు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వాలను రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్న టి-కాంగ్రెస్ నేతలు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. కాంగ్రెస్ సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెరాస సర్కార్ ప్రకటించగానే, వారు అత్యవసరంగా సమావేశమమయ్యి ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాజీనామాలు చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోరుతూ లేఖ పంపారు. అనుమతిరాగానే అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్చ ఇస్తోంది కనుక వారి నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో హటాత్తుగా ఉపఎన్నికలు జరుపవలసి వస్తుంది. అదే కనుక జరిగితే రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది.  

ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వం రద్దు చేయడం, ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయడాన్ని తెదేపా, భాజపాలు కూడా తప్పు పట్టాయి. ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశమయ్యారు. వారి సమావేశానికి సిఎల్పి నేత కె జానారెడ్డి కూడా హాజరయ్యారు.  

ఒకపక్క టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలకు సిద్దపడుతుంటే, మరోపక్క శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్, హరీష్ రావు తదితరులు తమ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకొన్నారు. ఈరోజు లేదా రేపటిలోగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వం రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


Related Post