కోమటిరెడ్డి శాసనసభ్యత్వం రద్దు

March 13, 2018


img

గవర్నర్ నరసింహన్ నిన్న తెలంగాణా ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యులు అనుచితంగా వ్యవహరించినందుకు సిఎల్పి నేత జానారెడ్డితో సహా 11 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. హెడ్ ఫోన్స్ విసిరి మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను గాయపరిచినందుకు కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వం రద్దు చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. సభ నుంచి సస్పెండ్ అయినవారిలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత జానారెడ్డి, శాసనసభ్యులు డికె అరుణ, మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, పద్మావతి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, మాధవ్ రెడ్డి ఉన్నారు. వీరందరినీ ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయాలనీ కోరుతూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి స్పీకర్ మధుసూదనాచారి ఆమోదం తెలిపారు. 

కాంగ్రెస్ శాసనసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు తప్పదని నిన్ననే స్పష్టమయింది. కానీ శాసనసభ చరిత్రలో మొదటిసారిగా ఇటువంటి కారణంతో ఇద్దరి సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడమే విశేషం. వారిరువురూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఖాయమే. కానీ ఇది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం కనుక దీనిపై న్యాయస్థానం కలుగజేసుకోకపోవచ్చు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజజకవర్గాలకు  ఉపఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. తెరాస సర్కార్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా ఖండించిన తరువాత మళ్ళీ ప్రజలలో వెళతామని ప్రకటిస్తారేమో?


Related Post