కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టిందా?

March 13, 2018


img

సోమవారం నుంచి మొదలైన రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మొదటిరోజే రసాభాసగామారాయి. గవర్నర్ నరసింహన్ ఉభయసభల సభ్యులనుద్దేశ్యించి ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు, పోడియం వద్దకు చేరుకొని నిరసనలు తెలుపుతూ, కాగితాలు చింపి గాలిలో ఎగురవేస్తూ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ పైకి హెడ్ ఫోన్స్ విసరడం...అది మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు నుదుటికి తగలడంతో సభలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీ సిబ్బంది స్వామి గౌడ్ ను సరోజినీదేవి నేత్రవైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

రాజకీయాలలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని సిఎల్పి నేత కె.జానారెడ్డి తరచూ చెపుతుంటారు. కానీ నిన్న శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో ఉన్న అంశాల పట్ల వారికి అసంతృప్తి ఉన్నట్లయితే దానిని అయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో తెలియజేయవచ్చు. కానీ ఆవిధంగా చేయకుండా శాసనసభ మొదటిరోజునే కాంగ్రెస్ సభ్యులు ఇంత తీవ్రంగా ప్రవర్తించడం యాదృచ్చికమని భావించలేము. 

సాధారణంగా శాసనసభ సమావేశాలు మొదలయ్యే ముందు, రాజకీయ పార్టీలు తమ సభ్యులతో సమావేశం నిర్వహించి సభలో ఏవిధంగా వ్యవహరించాలి? ప్రభుత్వాన్ని ఏవిధంగా నిలదీయాలి? వంటి విషయాలపై చర్చిస్తుంటాయి. కనుక ముందుగా అనుకొన్న ప్రకారమే కాంగ్రెస్ నేతలు సభలో నిన్న ఆవిధంగా ప్రవర్తించారని భావించవలసి ఉంటుంది. 

అయితే 27వరకు జరుగబోయే బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం ఉండగా కాంగ్రెస్ సభ్యులు మొదటిరోజే అంత అనుచితంగా ఎందుకు వ్యవహరించారు? అనే సందేహం కలుగకమానదు.  ఆవిధంగా వ్యవహరిస్తే శాసనసభ సమావేశాలు ముగిసేవరకు లేదా ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయబడతారని అందరికీ తెలిసిన విషయమే. బహుశః సస్పెండ్ చేయబడాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ సభ్యులు ఆవిధంగా వ్యవహరించి ఉండవచ్చు. 

ఒకవేళ ఇదే నిజమైతే వారు సస్పెండ్ చేయబడాలని ఎందుకు కోరుకొంటున్నారు? అని మరో సందేహం కలుగుతుంది. దానికి రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

1. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర ఆశించిన స్థాయిలో విజయవంతంకాకపోగా దాని వలననే పార్టీలో నేతల మద్య విభేదాలు బయటపడ్డాయి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి కొందరు కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేయాలని తహతహలాడుతున్నారు. కనుక సస్పెన్షన్ వేటు వేయించుకొని మళ్ళీ యాత్రలు మొదలుపెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ సభ్యులు నిన్న ఆవిధంగా వ్యవహరించి ఉండవచ్చు. ఈవాదన నిజమా కాదా అనేది ఒకటిరెండు రోజులలోనే తేలిపోతుంది. 

2. వివిధ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్లను కొన్ని రోజుల క్రితమే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలలో ఎవరెవరు ఎన్ని పిటిషన్లు వేయించారు? వాటికోసం డిల్లీలో ఎవరెవరిని కలిసారు? ఎంత ఖర్చు పెట్టారు? మొదలైన అన్ని వివరాలను ఈసారి శాసనసభ సమావేశాలలో బయటపెట్టి కాంగ్రెస్ నేతలను గట్టిగా నిలదీస్తామని చెప్పారు. అది కాంగ్రెస్ నేతలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితే కనుక సస్పెన్షన్ వేటు వేయించుకొని బయటపడాలనుకొన్నారేమో?

కారణాలు ఏవైనప్పటికీ, శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందని చెప్పక తప్పదు. వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి శాసనసభ నుంచి బయటపడాలనే ఉద్దేశ్యంతోనే ఆవిధంగా వ్యవహరించి ఉండి ఉంటే వారి వ్యూహం బెడిసికొట్టిందని చెప్పక తప్పదు. ఎందుకంటే సభలో వారి తీరు ప్రజలు కూడా అసహ్యించుకొనేవిధంగా ఉంది.  


Related Post