కెసిఆర్ ఎందుకు ఆ ఆలోచన చేస్తున్నారు?

March 05, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళి కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ప్రకటించారు. కెసిఆర్ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాప్పటికీ ఈ ప్రతిపాదనను అయన దృష్టి కోణంలో నుంచి కూడా చూడవలసిన అవసరం ఉంది. 

వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై మంచి అవగాహన ఉన్న కెసిఆర్, జాతీయస్థాయిలో ఈ రెండు రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుండటం, ఆ కారణంగా రైతులు, వ్యవసాయం దెబ్బతింటుండటం చూసి అసహనానికి గురవడం సహజమే. అలాగే రాచారిక పోకడలు ప్రదర్శించే కెసిఆర్ కు కేంద్రాన్ని పదేపదే సహాయం కోసం అర్ధించవలసి రావడం నామోషీ అనిపించడం సహజమే. అలాగే హక్కుల విషయంలోను ఆయనకు అసంతృప్తి ఉంది. కనుక ఈ సమస్యలను సరిచేయాలంటే జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం అవసరమని భావించి ఉండవచ్చు.

ఇక దీనినే మరో కోణంలో నుంచి చూసినట్లయితే రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రకటన చేసే ముందు, వచ్చే ఎన్నికలలో తెరాస ఖచ్చితంగా 106 సీట్లు గెలుచుకొంటుందని సర్వేలు స్పష్టం చేశాయని అయన చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆరు లక్షల మందిని సర్వే చేసి దీనిని నిర్ధారించుకొన్నట్లు ఆయనే చెప్పారు. కనుక వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా తెరాస గెలుస్తుందని నమ్మకం ఉంది కనుక తన కుమారుడు కేటిఆర్ ను ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలని కెసిఆర్ భావిస్తున్నారేమో? 

ఇదివరకు తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలో రాజధాని హైదరాబాద్ లోనే తెరాసకు తీవ్ర వ్యతిరేక పరిస్థితులు ఉండేవి. అవన్నీ చక్కదిద్ది జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో తెరాస నూటికి నూరు శాతం విజయం సాధిస్తుందని దృవీకరించుకొన్న తరువాత, గ్రేటర్ ఎన్నికలలో తెరాసను గెలిపించే బాధ్యతను ‘కేటిఆర్ ఒక్కరికే’ అప్పజెప్పారు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. 

అప్పుడు బంగారు పళ్ళెంలో గ్రేటర్ విజయాన్ని కేటిఆర్ కు అందించినట్లే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెరాస విజయానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, విజయం నిశ్చయమని రెండు మూడుసార్లు దృవీకరించుకొన్నాక, కేటిఆర్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు కనిపిస్తోంది. తద్వారా రాజకీయాలలో కేటిఆర్ ను మరోమెట్టు ఎక్కించాలని భావిస్తున్నారేమో?

ఇక ప్రతిపక్షాల కోణం నుంచి చూస్తే, ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ తెరాస, దాని అధినేత కెసిఆర్ పై ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. పార్టీలో పాత, కొత్త నేతల టికెట్ల కోసం ఒతిళ్ళు, ప్రతిపక్షాల విమర్శలు, అవినీతి ఆరోపణలు, కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు, దళితులపై దాడులు, ఉద్యోగాల భర్తీలో వైఫల్యం, నిరంకుశ పాలన వంటి అనేక సమస్యలున్నాయి. ఇక భాజపా-తెరాసలు కుమ్మక్కు అయ్యాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంటా బయటా పేరుకుపోయున్న ఈ సమస్యలపై నుంచి అందరి దృష్టి మళ్ళించకపోతే చాలా ప్రమాదం. బహుశః అందుకే హటాత్తుగా నాలుగేళ్ళ తరువాత మోడీకి వ్యతిరేకంగా ‘థర్డ్ ఫ్రంట్’ అంటూ హడావుడి చేస్తున్నారేమో? కారణాలు ఏవైనప్పటికీ, కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్తే చాలా మంచిదే. 


Related Post