ప్రధాని మోడీకి ప్రొఫెసర్ నాగేశ్వర్ సూటి ప్రశ్న

February 24, 2018


img

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, విక్రం కొఠారి వంటి ఆర్ధిక నేరగాళ్ళ చేతిలో పటిష్టమైన యంత్రాంగం కలిగిన బ్యాంకులు మోసపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దాని వలన బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోవడమే కాక వాటిని అనుమానంగా చూసే పరిస్థితి నెలకొని ఉంది. సామాన్య ప్రజలకు చిన్న రుణం ఇవ్వాలంటే సంకోచిస్తూ సవాలక్ష నిబంధనలు చెప్పే మన బ్యాంకులు అటువంటి నేరగాళ్ళకు అప్పనంగా వేలకోట్లు ముట్టజెపుతుండటమే అందుకు కారణం. 

ఇక అటువంటి నేరగాళ్ళు పరిశ్రమలు స్థాపిస్తామనగానే ప్రభుత్వాలు ముందూ వెనుకా చూడకుండా పోటీలు పడి వారికి అనేక రాయితీలు కల్పిస్తుంటాయి. రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాకొన్న విలువైన భూములను వారికి ధారాదత్తం చేస్తాయి. చివరికి వారు బ్యాంకులను మోసం చేసి విదేశాలు పారిపోయినప్పుడు వారికి భూములు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వాలు వారితో తమకు ఎటువంటి సంబంధమూ లేదని తప్పుకొంటాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. 

“హైదరాబాద్ జెమ్స్ (గీతాంజలి గ్రూప్) పరిశ్రమ కార్మికులకు ఉద్యోగ భద్రత” అనే అంశంపై హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దానిలో అయన మాట్లాడుతూ, “పరిశ్రమలకు భూములు, రాయితీలు ఇస్తే ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం చెపుతుంది. కానీ ఇప్పుడు నీరవ్ మోడీ బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోవడంతో ఈడి అధికారులు హైదరాబాద్ జెమ్స్ కంపెనీ (రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో ఉంది.) స్వాధీనం చేసుకొని తాళాలు వేశారు. దాంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారిప్పుడు ఎవరికీ మోరపెట్టుకోవాలి? ఆ ఉద్యోగులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఆదుకోవాలి,” అని అన్నారు.

ఆర్ధికనేరాలతో బ్యాంకులు వేలకోట్లు నష్టపోతాయి. ఆ కారణంగా బ్యాంకుల విశ్వసనీయత, ప్రతిష్ట దెబ్బ తింటుంది. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి బ్యాంకులు ఆ ఆర్ధిక భారాన్ని మళ్ళీ సామాన్యులపైనే మోపుతుంటాయి. అటువంటి సంస్థలు, బ్యాంకుల షేర్లలో పెట్టుబడులు పెట్టిన ప్రజలు బారీగా నష్టపోతారు. వారి సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడతారు. అంటే, నీరవ్ మోడీ వంటివారు చేసే ఆర్ధికనేరాల వలన కలిగే దుష్ప్రభావాలు చాలానే ఉంటాయని అర్ధం అవుతోంది. మరి అవీనీతి రహితమైన పాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న మోడీ సర్కార్ వీటికి ఏమని జవాబు చెపుతుంది? అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు. 


Related Post