కాళేశ్వరానికి లైన్ క్లియర్

February 24, 2018


img

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవరోధాలన్నీ తొలగిపోయాయి. దానికి అవసరమైన అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇక ఈ ప్రాజెక్టుపై కృష్ణా ట్రిబ్యునల్ లో జరిగిన విచారణకు రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు స్వయంగా హాజరయ్యి  రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ వాదనలను బలంగా వినిపించారు. ఆయనతోబాటు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ హాజరయ్యారు. వారి వాదనలు విన్న  ట్రిబ్యునల్ సంతృప్తి వ్యక్తం చేసింది. కనుక ట్రిబ్యునల్ తరపు నుంచి కూడా అన్ని అవరోధాలు తొలగిపోయినట్లే. మార్చి నెలాఖరులోగా ప్రాజెక్టుకు అవసరమైన మిగిలిన అన్ని అనుమతులు వస్తాయని మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు చెంపదెబ్బ వంటిది. వారి హయాంలో రైతులకు చేసిందేమీ లేదు కానీ ఇప్పుడు మేము సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు అందించాలని ప్రయత్నిస్తుంటే వారు ఈవిధంగా ట్రిబ్యునల్స్, కోర్టులలో కేసులు వేసి అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెవరు ఏ కేసులు వేయించారు? వాటి కోసం ఎంత డబ్బు ఖర్చు చేశారు? దీని కోసం వారు డిల్లీలో ఎవరెవరిని కలిశారు? వంటి వివరాలన్నీ మాదగ్గర ఉన్నాయి. ఈసారి శాసనసభ సమావేశాలలో ఆ వివరాలను బయటపెడతాం. రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు సమస్యలు పరిష్కరించడానికే మేము ప్రాజెక్టులు, మిషన్ భగీరధ వంటి పధకాలు చేపట్టాము. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 5నెలలపాటు రోజుకు 2 టి.ఎం.సి.ల నీళ్ళు ఎతిపోసుకొని మన జలాశయాలు, చెరువులు అన్నీ నింపుకోవచ్చు. అటువంటి మంచి ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ నేతలు అడ్డుపడటం దురదృష్టకరం. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు చూసిన తరువాతైన వారు మారకపోతే రాష్ట్ర ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.


Related Post