నేతన్నలకు శుభవార్త!

February 24, 2018


img

చేనేత కార్మికులకు ఒక శుభవార్త. 2014, జనవరి 1వ తేదీ నుంచి 2017, మార్చి 31లోపుగా వారు బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలలో అసలు, వడ్డీ కలిపి లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేశారు. దాని ప్రకారం.. 

1. జె.ఎల్.జి. వార్షిక రుణాలకు ఈ రుణమాఫీ వర్తించదు. పెట్టుబడి కోసం తీసుకొన్న వ్యక్తిగత రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

2. చాలా కాలంగా అప్పులు చెల్లించని కారణంగా నిరర్ధక ఆస్తులున్న చేనేత కార్మికులకు ఈ రుణమాఫీ వర్తించదు.

3. లక్ష రూపాయల కంటే అధనంగా తీసుకొన్న అప్పు దానికి అయిన వడ్డీని చేనేత కార్మికులు ముందుగా తీర్చవలసి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకులో అసలు, వడ్డీ కలిపి లక్షా నలబైవేలు అప్పు ఉన్నట్లయితే దానిలో నలబై వేలను ఆ చేనేత కార్మికుడు ముందుగా తీర్చవలసి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం మిగిలిన లక్ష రూపాయలను మాఫీ చేస్తుంది. (రైతుల పంట రుణాల మాఫీలో ఎదురైనా చేదు అనుభవాలాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లుంది.)

4. ఈ రుణమాఫీ పొందడానికి చేనేత కార్మికులు 2017 జూన్-సెప్టెంబర్ నెలల మద్య కాలంలో తీసుకొన్న రుణాల వివరాలను బ్యాంకులకు తప్పనిసరిగా అందించాలి. 

5. వాటి ఆధారంగా పాత అప్పును మాఫీ చేయడమే కాకుండా మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ కోసం లక్ష రూపాయల వరకు తీసుకొన్న అప్పులను కూడా మాఫీ చేయడానికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.   

6. ఒకవేళ ప్రభుత్వం సూచించిన మూడేళ్ళ కాలపరిమితిలో ఎవరైనా రుణాలు తీర్చేసినా లేదా ఎంత సొమ్ము చెల్లిస్తే దానిని ప్రభుత్వం తిరిగి ఇస్తుంది. 

ప్రభుత్వం పేర్కొన్న ఈ మూడేళ్ళ కాలంలో బ్యాంకుల నుంచి లక్ష రూపాయలలోపు అప్పు తీసుకొన్న చేనేత కార్మికుల సంఖ్య: 3,757. వారు తీసుకొన్న మొత్తం రూ.14.76 కోట్లు. లక్ష రూపాయలకు మించి అప్పు తీసుకొన్నవారి సంఖ్య 413. వారికి ఇచ్చిన మొత్తం రూ.8.21 కోట్లు. దీర్గకాలంగా అప్పులు చెల్లించని కారణంగా నిరర్ధకంగా గుర్తించబడిన అకౌంట్ల సంఖ్య 237. వారు చెల్లించవలసిన మొత్తం రూ.78 లక్షలు. 


Related Post