ఆ ఆలోచన ఎన్నికల కోసమేనా?

February 23, 2018


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే కనీసం 1.50 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కెసిఆర్ తో సహా తెరాస నేతలు అందరూ బల్లగుద్ది చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళు పూర్తికావస్తున్నా తెరాస సర్కార్ ఇంతవరకు కనీసం లక్ష ఉద్యోగాలైనా భర్తీ చేయలేకపోయింది. ఏమంటే అనేక కారణాలు చెపుతుంది. ఇంకా గట్టిగా అడిగితే కోపం వస్తుంది. తెరాస నేతలు ఎదురుదాడి చేస్తుంటారు కూడా. అయితే అంతమాత్రన్న పరిస్థితులు...వాస్తవాలు మారిపోవు...అటువంటి వాదనల వలన నిరుద్యోగులలో అసంతృప్తి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ప్రతిపక్షాలు, ప్రొఫెసర్ కోదండరాం వంటి నేతలు ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంటారు. 

ఉద్యోగాల భర్తీ హామీ ఇంకా కాగితాలకే పరిమితమై ఉండగానే మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. కనుక ప్రతిపక్షాల విమర్శలు, అందోళనల కారణంగా నిరుద్యోగ యువతలో తెరాస పట్ల విముఖత ఏర్పడే ప్రమాదం ఉంది. నాలుగేళ్ళపాటు పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసుకొని చివరి సంవత్సరంలో ఇటువంటి కారణంతో నష్టపోవాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. కనుక తెరాస సర్కార్ కూడా నిరుద్యోగ భృతి గురించి ఆలోచనలు చేయడం మొదలుపెట్టిందని చెప్పవచ్చు. నెలకు రూ.2,000 చొప్పున ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం దీనిపై కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి దీనిని అమలుచేయాలని భావిస్తోంది. 

ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి కనుక దీనిని కూడా ‘హామీ’గా ప్రకటిస్తే సరిపోతుంది. వచ్చే ఎన్నికలలో కూడా తెరాసనే మళ్ళీ గెలిపిస్తే అమలుచేస్తామని గట్టిగా ప్రచారం చేసుకొనే వెసులుబాటు ఉంటుంది పైగా ప్రస్తుతానికి ప్రభుత్వంపై అదనపు ఆర్ధికభారం పడదు. ఈ హామీతో ప్రతిపక్షాల వాదనలను త్రిప్పికొట్టవచ్చు కూడా.

రాష్ట్రంలో సుమారు 25-30 లక్షల మంది నిరుద్యోగులున్నారని అంచనా. (రేపటి నుంచే ప్రారంభం కాబోయే టి.ఆర్.టి. పరీక్షలకే 2,48,216 మంది అభ్యర్ధులు (నిరుద్యోగులు) దరఖాస్తు చేసుకొన్నారు.) ప్రతీ ఏటా వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. వారిలో కేవలం 10 లక్షల మందికి మాత్రమే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతీ నెల రూ.200 కోట్లు...ఏడాదికి 24,000 కోట్లు అవసరం ఉంటుంది. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ ఇవ్వాలంటే ఎంతవుతుందో లెక్కకట్టుకోవచ్చు. కనుక ఇది ఆచరణ సాధ్యం కాని హామీ అని అర్ధమవుతూనే ఉంది. 

ఎన్నికలలో గెలవడం కోసం ‘లక్షన్నర ఉద్యోగాలు’ ఇస్తామని హామీ ఇచ్చి, తరువాత ఎన్నికలలో ‘నిరుద్యోగ భృతి’ ఇస్తామని హామీ ఇవ్వడం అంటే మొదటి హామీని నిలబెట్టుకోలేదని దృవీకరిస్తున్నట్లే కదా! ఆ హామీ నిలబెట్టుకోలేకపోయినప్పుడు మళ్ళీ ఈ కొత్త హామీని నిలబెట్టుకొంటుందనే నమ్మకం ఏమిటి?


Related Post