కాంగ్రెస్, భాజపా దొందూ దొందే: కేజ్రివాల్

February 17, 2018


img

యూపియే హయంలో కాంగ్రెస్ అంటే కుంభకోణం..కుంభకోణం అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా ఉండేది. అందుకే దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని పక్కన పడేసి మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమికి అధికారం కట్టబెట్టారు. ఊహించినట్లుగానే అయన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు లేకుండా పాలన సాగిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ సర్కార్ ను వేలెత్తి చూపలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. అయితే విజయ్ మాల్యా, తాజాగా నీరవ్ మోడీ బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపీలు పెట్టేసి విదేశాలకు పారిపోయారు. వారు విదేశాలకు పారిపోక మునుపే వారి అక్రమాలు బయటపడినప్పటికీ, వారు దేశం దాటి పారిపోకుండా మోడీ సర్కార్ అడ్డుకోలేదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుగా ఇప్పుడు వారిని వెనక్కు రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. 

మోడీ సర్కార్ కు ప్రత్యక్షంగా అవినీతి మరకలు అంటుకోలేదు కానీ ఇటువంటి ఆర్దిక నేరగాళ్ళు సురక్షితంగా దేశం విడిచి పారిపోగలుగుతున్నారంటే అది మోడీ సర్కార్ వైఫల్యమేనని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాదన. నిజానికి కాంగ్రెస్, భాజపాలు రెండూ తోడు దొంగలని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయంలో అనేక కుంభకోణాలు జరిగితే, మోడీ సర్కార్ వాటిలో ఒక్క దానిలోనైనా దోషులను పట్టుకొని శిక్షించిందా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ హయంలో మొదలైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ఇప్పటి వరకు ఏవిధంగా సాగగలిగింది? దానిలో కూడా దోషులను ఎందుకు వదిలేశారు? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ కుంభకోణాల వలన కాంగ్రెస్, భాజపాలు లాభపడుతున్నాయని, కానీ పైకి మాత్రం ఒకదానినొకటి విమర్శించుకొంటూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.


Related Post