టి-కాంగ్రెస్ వ్యూహం అదేనా?

February 16, 2018


img

వచ్చే ఎన్నికలలో తాను నల్లగొండ ఎంపి స్థానానికి పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్ననే ప్రకటించారు. టికెట్స్ కేటాయింపు కార్యక్రమం ఇంకా మొదలవక మునుపే అయన ఆవిధంగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే టి-కాంగ్రెస్ దానిపై స్పందించకపోవడం విశేషం. 

వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నేతలందరినీ లోక్ సభకు పోటీ చేయించి వారి పుత్రరత్నాలను శాసనసభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తాజా సమాచారం. ఆవిధంగా చేసినట్లయితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రాలేకపోతే పార్టీ భవిష్యత్, దానితో బాటు రాహుల్ గాంధీ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతుంది. కనుక రాష్ట్రాలలో కంటే కేంద్రంలో అధికారంలోకి రావడం చాలా అవసరం. కానీ ఎన్నికలలో భాజపాను డ్డీకొని విజయం సాధించడం అంత తేలిక కాదు. కనుక వీలైనన్ని లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలంటే హేమాహేమీలనే బరిలోకి దించకతప్పదు. కనుక టి-కాంగ్రెస్ లోని సీనియర్ నేతలందరినీ లోక్ సభకు, వారు కోరుకొంటున్నట్లుగా వారి పుత్రరత్నాలకు శాసనసభకు పోటీ చేయించినట్లయితే, సీనియర్లు తమ గెలుపు కోసం ఎంతగా శ్రమిస్తారో తమ పుత్రరత్నాల కోసం అంతే శ్రమిస్తారు కనుక ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. 

ఒకవేళ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ వారసులు ఓడిపోయినా, ఎంపి స్థానాలను గెలుచుకోగలిగితే అది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు చాలా ఉపయోగపడుతుంది. పైగా ఇంతకాలం ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లందరికీ ప్రమోషన్ ఇచ్చినట్లు ఉంటుంది. వారి వారసులకు టికెట్స్ ఇచ్చినందున అందరూ కాంగ్రెస్ అధిష్టానానికి విధేయంగా ఉంటారు. 

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం ఈ వ్యూహంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో ఈ ఆలోచన ఉంది కనుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరినీ సంప్రదించకుండా తాను ఎంపి స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించి ఉండవచ్చు. త్వరలోనే ఈ కాంగ్రెస్ వ్యూహంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఈ వ్యూహం అమలుచేయదలిస్తే, ఇక తెరాస నిశ్చింతగా ఎన్నికలకు వెళ్ళవచ్చు.             



Related Post