ప్రశంశలు సరే..నిధులిస్తారొ లేదో?

February 16, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న డిల్లీలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలవడానికి వెళుతున్నప్పుడు కేంద్ర ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ ఎదురయ్యారు. అయన కెసిఆర్ ని పలకరించి తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న పంట పెట్టుబడి పధకం చాలా బాగుందని, అది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మెచ్చుకొన్నారు. ఈ పధకాన్ని కేంద్రం కూడా అధ్యయనం చేయాలని తను అరుణ్ జైట్లీకి చెప్పానని చెప్పారు. ఫిబ్రవరి 19న హైదరాబాద్ వచ్చినప్పుడు దీని గురించి చర్చిద్దామని చెప్పగా కెసిఆర్ ఆయనను భోజనానికి ఆహ్వానించారు.

తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పధకాలను కేంద్ర మంత్రులు, అరవింద్ సుబ్రహ్మణియన్ వంటి ఉన్నతాధికారులు పదేపదే మెచ్చుకొంటూనే ఉన్నారు. కానీ వాటికి సకాలంలో నిధులు కేటాయించడం లేదు. ఆ కారణంగా నిధుల కోసం రాష్ట్ర ఎంపిలు, మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు, చివరికి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా వారి చుట్టూ తిరగక తప్పడం లేదు. కెసిఆర్ నిన్న అరుణ్ జైట్లీను కలిసింది అందుకే. ప్రధాని నరేంద్ర మోడీని కలువబోయేది అందుకే. 

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శమని చెపుతున్నప్పుడు, వాటి కోసం అడగకుండానే నిధులు కేటాయిస్తే ఆ ప్రశంశలకు అర్ధం ఉంటుంది. కానీ నిధుల కేటాయింపు విషయానికి వచ్చే సరికి అసలు తెలంగాణా రాష్ట్రమనేది ఒకటుందని తెలియన్నట్లు కేంద్రం వ్యవహరిస్తుంటుంది. కేంద్ర బడ్జెట్ అందుకు తాజా నిదర్శనం. 

తెలంగాణా రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా ఏటా వేలకోట్లు తీసుకొంటున్న కేంద్రం, రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తుంటుంది. అయినా నిధులు రాబట్టుకొనేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సహనంగా తన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పంట పెట్టుబడి పధకం చాలా అద్భుతమని, దేశానికే ఆదర్శమని చెపుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న సహాయసహకారాలు అందిస్తే బాగుంటుంది కదా! 


Related Post