ఏపిలో రాజీనామాల భాగోతం

February 16, 2018


img

పొరుగు రాష్ట్రం ఏపిలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాలు రాజీనామాల డ్రామాలు మొదలుపెట్టాయి. నాలుగేళ్ళలో ఏమి చేయలేక తమ వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వంపై వేసి వచ్చే ఎన్నికలలో ఒడ్డున పడాలని తెదేపా భావిస్తుంటే, శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టి పాదయాత్రలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్రజలలో మళ్ళీ ప్రత్యేకహోదా సెంటిమెంటు రగిల్చి ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలనే తన కలను సాకారం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. కనుక రెండు పార్టీలు పోటా పోటీగా ఎంపిల రాజీనామాల డ్రామాను షురూ చేసాయి. 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న తమ ఎంపిలు రాజీనామాలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రకటించగానే, ఈ రేసులో ఎక్కడ తాము వెనకబడిపోతామో...జగన్మోహన్ రెడ్డి తమను ప్రజల ముందు దోషిగా నిలబెడతాడనే భయంతో పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే రోజున అంటే మార్చి 5 నుంచే తాము రాజీనామాలు చేస్తామని తెదేపా ప్రకటించేసింది. 

ఏపిలో భాజపా ఎలాగూ తనంతట తానుగా అధికారంలోకి రాలేదు. నాలుగైదు ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపి సీటు, రెండు మంత్రి పదవుల వలన పార్టీకి ఒరిగేదేమీ ఉండదు. కనుక తమతో తెదేపా పొత్తులు తెంచుకొన్నా, తెదేపా, వైకాపా ఎంపిలు రాజీనామాలు చేసినా..కేంద్రానికి, రాష్ట్ర భాజపాకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. ఆ రెండు పార్టీలు హటాత్తుగా ఎందుకీ డ్రామాలు మొదలుపెట్టాయో కేంద్రానికి తెలుసు..అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కనుక అందరూ నిర్లిప్తంగా వారి డ్రామాలను చూస్తున్నారు. 


Related Post