హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎం అడ్డుగోడ: భాజపా

February 15, 2018


img

 హైదరాబాద్ అభివృద్ధికి మజ్లీస్ పార్టీ పెద్ద అడ్డుగోడలా మారిందని భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. దశాబ్దాలు గడుస్తున్నా హైదరాబాద్..పాతబస్తీ...దానిలో నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నారు. ఇన్నేళ్ళుగా పాతబస్తీ నుంచి ఎన్నికవుతున్న మజ్లీస్ నేతలు ఎంతసేపు ముఖ్యమంత్రి కెసిఆర్ కు బాకా ఊదడమే తప్ప పాతబస్తీ అభివృద్ధికి ఏమి చేశారని కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. మజ్లీస్ పార్టీని తప్పిస్తే తప్ప హైదరాబాద్ ముఖ్యంగా పాతబస్తీ అభివృద్ధి చెందదని అన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ‘ఎంఐఎం హటావో హైదరాబాద్ బచావో’ అనే నినాదంతో ముందుకు వెళుతుందని అన్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ సోదరులను ఓడించగల యువనేతలను తమ పార్టీ ప్రోత్సహిస్తుందని అన్నారు. రామ్ మందిరం సమస్యను కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలనే సుప్రీం కోర్టు సూచన మేరకు ప్రయత్నాలు జరుగుతుంటే, అసదుద్దీన్ ఒవైసీ దానికి అవరోధాలు సృష్టిస్తున్నారని కృష్ణసాగర్ రావు ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న సల్మాన్ నాజరీ దీని గురించి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తో చర్చలు జరిపినందుకే అసదుద్దీన్ ఒవైసీ ఆయనను ఆల్ ఇండియా ముస్లిం లాబోర్డు నుంచి తొలగించారని ఆరోపించారు. 

హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడానికి తెరాస సర్కార్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే కృష్ణసాగర్ రావు చెపుతున్నట్లుగా, ఆ అభివృద్ధి పాతబస్తీకి విస్తరించకపోవడానికి ప్రధాన కారణం మజ్లీస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఉదాహరణకు పాతబస్తీ గుండా నిర్మించతలపెట్టిన మెట్రో రైల్ కారిడార్ పనులు ముందుకు సాగకపోవడానికి కారణం మజ్లీస్ పార్టీయేనని అందరికీ తెలుసు. అదేవిధంగా పాతబస్తీలో 14-16 ఏళ్ళ ఆడపిల్లలను 60-70 సం.ల వయసున్న అరబ్ షేక్ లకు ఇచ్చి నిఖాలు జరుగుతుంటే మజ్లీస్ పార్టీ వాటిని అడ్డుకోలేదు. 

మజ్లీస్ అధినేతలకు ఎంతఃసేపు తమ పార్టీని ఇతర రాష్ట్రాలకు ఏవిధంగా విస్తరించుకొందామనే యావ తప్ప పాతబస్తీ అభివృద్ధి, అక్కడి పేద ముస్లిం ప్రజల సంక్షేమం ఏనాడు పట్టించుకోలేదు. పాతబస్తీలో కొన్ని లక్షలమంది ముస్లింలు దయనీయమైన జీవితాలు గడుపుతున్నారు. పేదరికం, అనారోగ్యం కారణంగా అనేకమంది మహిళలు, చిన్నారులు, వృద్ధుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మజ్లీస్ పార్టీ మాత్రమే ముస్లింలకు అసలు సిసలైన ప్రతినిధి అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప వారి సంక్షేమం కోసం అది చేసిందేమీ లేదు. ఒకవేళ చేసి ఉంటే నేడు పాతబస్తీలో ముస్లింల పరిస్థితి ఈవిధంగా ఉండేది కాదు. 


Related Post