ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే హంగ్: కిషన్ రెడ్డి

February 13, 2018


img

‘రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం భాజపా మాత్రమే. వచ్చే ఎన్నికలలో మేమే విజయం సాధించి అధికారంలోకి వస్తాము.’ రాష్ట్ర భాజపా నేతలు నిత్యం పాడే పాట ఇది. అయితే వాస్తవ పరిస్థితులు ఏమిటో వారికీ తెలుసు ప్రజలకు కూడా బాగా తెలుసు. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నోట అందుకు భిన్నమైన మాటలు వినబడ్డాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే భాజపా గెలుస్తుందని చెప్పకుండా ‘హంగ్’ ఏర్పడుతుందని చెప్పడం వాస్తవికతకు కాస్త దగ్గరగా ఉందని చెప్పవచ్చు. 

వచ్చే ఎన్నికలలో భాజపా ఎన్ని సీట్లు గెలుచుకొంటుందో చెప్పలేకపోయినా తెరాసకు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనీయబోతోంది కనుక వాటి మద్య ఓట్లు, సీట్లు చీలడం ఖాయం. సాధారణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అంచనాలు ఎప్పుడూ తప్పవు. వచ్చే ఎన్నికలలో తెరాసకు 100-105 సీట్లు గెలుచుకోవడం ఖాయమని పదేపదే చెపుతున్నారు. కానీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతున్నప్పుడు తెరాస అన్ని గెలుచుకోగలదా? అనే అనుమానాలు కలగడం సహజం. కనుక అన్ని సీట్లు కాకపోయినా కాంగ్రెస్ చెప్పుకొంటున్నట్లు కనీసం 70 సీట్లు గెలుచుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ఒకవేళ ఆ సమయానికి కాంగ్రెస్ ఇంకా పుంజుకొన్నట్లయితే కిషన్ రెడ్డి చెప్పినట్లుగా హంగ్ ఏర్పడవచ్చు.

ఇక కిషన్ రెడ్డి తొలిసారిగా రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ ల గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ అయన కాంగ్రెస్ లో చేరడమే సరైన నిర్ణయమని అన్నారు. ఒకవేళ అయన భాజపాలో చేరి ఉండి ఉంటే ఎంతో కాలం ఇమడలేకపోయుండేవారన్నారు. ఎందుకంటే భాజపాలో క్రమశిక్షణ ఎక్కువ, వ్యక్తిగత దూషణలకు అవకాశం తక్కువ అన్నారు. 

పవన్ కళ్యాణ్ కు అసలు నటించడమేరాదని అయన కంటే రాం చరణ్ తేజ్ బాగా నటిస్తున్నాడని అన్నారు. పవన్ కళ్యాణ్ కు నటన రాకపోయినా అన్న చిరంజీవికున్న పరపతిని ఉపయోగించుకొని లాగించేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కూడా పనికిరాడని, కానీ మీడియాను అడ్డుపెట్టుకొని రాజకీయాలలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడుతున్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

మహేష్ కత్తికి మీడియా అనవసర ప్రాధాన్యం ఇవ్వడం వలననే అతను రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.


Related Post