అవును..అతను ఉగ్రవాదే!

February 13, 2018


img

ముంబై 2008 ప్రేలుళ్ళ సూత్రధారి లష్కర్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను అప్పగించాలని భారత్ సర్కార్ ఎన్నిసార్లు కోరినా అతను ఉగ్రవాది కాదంటూ వెనకేసుకు వచ్చింది పాక్ సర్కార్. పాక్ న్యాయస్థానాలు కూడా అతనిని నిర్దోషి అని తేల్చి చెప్పాయి. కానీ ఈరోజు అదే పాక్ ప్రభుత్వం అతను ఒక ఉగ్రవాది అని ప్రకటించడం విశేషం. అటువంటి ఉగ్రవాదులను కాపాడుతున్నందుకు అమెరికా ఆర్ధికసహాయం నిలిపివేయడంతో పాక్ చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. పైగా హఫీజ్ సయీద్ రాజకీయ పార్టీ స్థాపించి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దపడుతుండటంతో పాక్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగినట్లుంది. ఒకవేళ అతను అధికారం కైవసం చేసుకొంటే, పాక్ ఒక ఉగ్రవాద రాజ్యంగా మారిపోతుందనే భయం పాక్ పాలకులు కలిగినట్లుంది. అందుకే అతనికి అటువంటి అవకాశం లేకుండా చేసేందుకు పాక్ సర్కార్ అతనిని ఉగ్రవాదుల జాబితాలో చేర్చుతూ ఉతర్వులు జారీ చేసింది. కనుక ఇంతకాలం ఒక ఉగ్రవాదిని పెంచి పోషిస్తున్నట్లు పాక్ పాలకులు స్వయంగా దృవీకరించినట్లయింది. అయితే ప్రభుత్వాన్ని సైతం శాసించగల శక్తిమంతుడిగా ఎదిగిన హఫీజ్ సయీద్ ను పాక్ ప్రభుత్వం కట్టడిచేయగలదా..లేదా?అనేది త్వరలోనే తేలిపోతుంది. పాక్ పాలకులకు నిజంగా అతనిని ఉగ్రవాదని అంగీకరించదలిస్తే, అతనిని భారత్ కు అప్పగించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవలసి ఉంటుంది. లేకుంటే భారత్, అమెరికాలను మభ్యపెట్టడానికే ఈ సరికొత్త నాటకం మొదలుపెట్టిందని భావించక తప్పదు. 


Related Post