అయితే ఇక హైకోర్టు విభజన లేనట్లే!

February 12, 2018


img

సుమారు నాలుగు సంవత్సరాలు నాన్చిన తరువాత ఏపిలో తాత్కాలిక భవనాలలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి ఏపి సర్కార్ సంసిద్దత వ్యక్తపరిచింది. అయితే హైకోర్టు కోసం అది సూచించిన భవనాలు హైకోర్టు నిర్వహణకు సరిపోవని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో, ఏపి సర్కార్ హైకోర్టు కోసం ఈ ఏడాది మేనెలాఖరులోగా అమరావతిలో తాత్కాలిక భవనాలను నిర్మించి, జూన్ నాటికి హైకోర్టు తరలింపు ప్రక్రియ పూర్తి చేద్దామనుకొంది. కానీ ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన చేస్తోంది. అమారావతి పరిధిలో 1.96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిటీ సివిల్ కోర్టు కోసం భావన సముదాయాలను 8 నెలలలోగా నిర్మిస్తామని, అది సిద్దం అయ్యాక దానిలోకి హైకోర్టును తరలిస్తామని ఏపి సర్కార్ లో నెంబర్: 2 స్థానంలో చక్రం తిప్పుతున్న మంత్రి నారాయణ ఈరోజు మీడియాకు తెలిపారు.

అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది అక్టోబర్ నాటికి భవనాలు సిద్దం కావాలి. కానీ నిర్మాణ కార్యక్రమాలలో ఎప్పుడూ ఆలస్యం అనివార్యం. కనుక ఈ ఏడాది చివరి నాటికి వాటి నిర్మాణాలు పూర్తయితే, 2019లో హైకోర్టు తరలింపు గురించి ఆలోచించవచ్చు. అప్పటికి ఎన్నికలు దగ్గరపడతాయి కనుక హైకోర్టు విభజన, తరలింపుపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసక్తి, సమయం ఉండదు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో ఏపిలో తెదేపా ఓడిపోయి వైకాపా అధికారంలోకి వచ్చినట్లయితే అది ప్రభుత్వంలో కుదురుకొని హైకోర్టు గురించి ఆలోచించడానికి మరొక ఏడాది సమయం పట్టవచ్చు. ఒకవేళ తెదేపాయే మళ్ళీ అధికారంలోకి వస్తే, రెండు మూడు నెలలో హైకోర్టు తరలింపు ప్రక్రియ పూర్తికావచ్చు. కనుక ఈ ఏడాదిలో హైకోర్టు విభజన గురించి మరిచిపోవచ్చు.


Related Post