మోడీని వదిలి కాంగ్రెస్ పై విమర్శలేల? దాసోజు

February 12, 2018


img

“పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసి యూపియే సర్కార్ రాష్ట్ర విభజన జరిపిందని, దానిని తాము వ్యతిరేకించినప్పటికీ తెలంగాణా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి తమ పార్టీ సహకరించిందని” ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో అన్నారు. 

అయన మాటలు తెలంగాణా ఉద్యమాలను కించపరిచేవిధంగా ఉన్నప్పటికీ తెరాస నేతలు ఎవరూ స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పు పడుతూ మంత్రి కేటిఆర్ కు ఒక బహిరంగ లేఖ వ్రాశారు. 

మోడీ వ్యాఖ్యలపై నిరసన తెలుపవలసిన మంత్రి కేటిఆర్, హడావుడిగా ప్రగతి భవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ అంటూ కాంగ్రెస్ పార్టీపై చవుకబారు విమర్శలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ లోఫర్ పార్టీ అయితే, దానిలోనే పుట్టి రాజకీయ ఓనమాలు దిద్దుకొని తెరాసను స్థాపించిన కెసిఆర్, తెరాసలో చేరిన కే కేశవరావ్ , డి.శ్రీనివాస్, గుత్తా, ఆమోస్, యాదవ్ రెడ్డి మొదలైనవారందరూ కూడా ఆ కోవకు చెందినవారేనా? అని దాసోజు శ్రవణ్ తన లేఖలో కేటిఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, తెలంగాణా ఉద్యమాలను అవహేళన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి తెరాస నేతలు ఎందుకు వంగి వంగి దండాలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజకీయ సన్యాసం సవాలు విసిరిన కేటిఆర్ మళ్ళీ ఎందుకు వెనక్కు తగ్గారని ప్రశ్నించారు. ఆవిధంగా మాట్లాడటం తప్పని ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి లేదా దమ్ముంటే ఏదైనా బహిరంగవేదికపై ప్రతిజ్ఞ చేయడానికి రావాలని దాసోజు శ్రవణ్ మంత్రి కేటిఆర్ కు తన లేఖద్వారా సవాలు విసిరారు. 

దాసోజు శ్రవణ్ చేసిన విమర్శలలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని విడిచిపెట్టి తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీనే ఎందుకు విమర్శిస్తున్నారు? అనే ప్రశ్న ఆలోచింపజేసిదిగా ఉంది. 

తెలంగాణాలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికలలో కారుకు బ్రేకులు వేయగలిగే శక్తి హస్తానికే ఉంది. కనుక కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బ తీయాలని తెరాస ప్రయత్నించడం సహజమే. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ కు బదులు భాజపా బలంగా ఉండి ఉంటే, అప్పుడు తెరాస కాంగ్రెస్ ను విడిచిపెట్టి భాజపాను, కేంద్రప్రభుత్వాన్నే గట్టిగా విమర్శిస్తుండేదని వేరే చెప్పనవసరం లేదు. సార్వత్రిక ఎన్నికలకు సుమారు ఏడాది సమయం ఉంది కనుక తెలంగాణా అభివృద్ధికి కేంద్రం సహాయసహకారాలు చాలా అవసరం. అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ పంటినొప్పికి చికిత్సకని డిల్లీ వెళ్ళి, ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం ఓపికగా ఎదురుచూస్తున్నారు.  

ఒకవేళ తెలంగాణాకు కేంద్రం ఇక ఏమీ ఇవ్వబోదని స్పష్టం అయితే తెరాస తన అస్త్రశస్త్రాలను కేంద్రప్రభుత్వంపై ఎక్కుపెట్టకుండా విడిచిపెట్టదు. అయితే ఎన్నికలు దగ్గర పడేవరకు తెరాస నేతలు సంయమనం పాటించవచ్చు.  కానీ వచ్చే ఎన్నికలలో తెరాసకు ప్రధానప్రత్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ నిలువబోతోందనే విషయం స్పష్టం అయ్యింది కనుక తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా పూర్తిగా బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా తనను తాను కాపాడుకొంటూ తెరాసను గట్టిగానే ఎదుర్కోవలసి ఉంటుంది. 


Related Post