వాటిని నమ్ముకొంటే ఇక అంతే: హరీష్ రావు

February 12, 2018


img

జాతీయస్థాయిలో కాంగ్రెస్, భాజపాలే ఒకదాని తరువాత మరొకటి అధికారం చలాయిస్తున్నప్పటికీ, రాష్ట్రస్థాయిలో మాత్రం ప్రాంతీయపార్టీలదే పైచెయ్యిగా ఉంటోంది. జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నట్లయితే, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జాతీయ పార్టీలను ఆదరించి ఉండేవారేమో? కానీ ఆ రాష్ట్రాలలో మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ సమస్యలు పేరుకుపోతుండటంతో ప్రజలు ప్రాంతీయ పార్టీలవైపే మొగ్గు చూపుతున్నారు.

మంత్రి హరీష్ రావు నిన్న ఖమ్మం నగరంలో ‘లకారం టాంక్ బండ్’ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా అయన మాట్లాడుతూ “రాష్ట్రాల అభివృద్ధిని, ప్రజల బాధలను పట్టించుకొని జాతీయ పార్టీలను నమ్ముకొంటే, డిల్లీ దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూపులు తప్పవు. దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రాభివృద్ధి కోసం, ఇక్కడి ప్రజల కోసం ఏమి చేసింది? కాంగ్రెస్ నేతలకు ఎప్పుడూ ‘కుర్చీల యావే.’ అందుకే గాంధీ భవన్ లో కూర్చొని తమకే 100 సీట్లు వస్తాయని పగటి కలలు కంటున్నారు. ఈ మూడున్నరేళ్ళలో ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మన ప్రభుత్వం బారీగా ఖర్చు చేస్తోంది. రూ.300 కోట్లు వ్యయంతో సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ప్రతీ గ్రామానికి సాగు, త్రాగు నీటిని అందించడానికి చురుకుగా పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ తరహా లో ఖమ్మం నగరం చుట్టూ రూ.180 కోట్లు వ్యయంతో అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగబోతోంది. సుమారు 400 ఎకరాలలో ఫారెస్ట్ పార్క్ నిర్మాణం జరుగబోతోంది. రూ.37 కోట్లు వ్యయంతో బుగ్గవాగు ప్రాజెక్టు నుంచి కామేపల్లి, కారేపల్లి, రఘునాధపాలెం మండలాలకు సాగునీరు అందించబోతున్నాము. ఖమ్మంలో ఐటి హబ్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈవిధంగా జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది,” అని అన్నారు.

ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడుతుందనేది ఇప్పటికే చాలా రాష్ట్రాలలో నిరూపించబడింది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రులకు స్వేచ్చ ఉండేది కాదు. కనీసం వారి పదవులకు కూడా గ్యారెంటీ ఉండేది కాదు. ఆ కారణంగా వారు ఎప్పుడూ తమ కుర్చీలను కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సివచ్చేది. ఒకవేళ ఏవైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలన్నా మంత్రి హరీష్ రావు చెప్పినట్లుగా వాటిని ఆమోదింపజేసుకోవడానికి డిల్లీ చుట్టూ ప్రదక్షిణలు తప్పనిసరి.

మన పొరుగునే ఉన్న ఏపిలో తెదేపా, భాజపాతో పొత్తులు పెట్టుకొని ఇప్పుడు నిధుల కోసం కేంద్రంతో ఏవిధంగా పోరాడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. జాతీయపార్టీలకు రాష్ట్రాల పట్ల ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్న చూపు ఉందని చెప్పడానికి ఏపి ఒక తాజా ఉదాహరణగా కాళ్ళ ముందు కనిపిస్తోంది. అందుకే ప్రజలు జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలవైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో తెరాసను ఓడించి అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ ఇది గ్రహించి తదనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోగలిగితే ప్రజలు దానిని నమ్మే అవకాశం ఉంటుంది.


Related Post