కేంద్రబడ్జెట్ లో తాయిలాలు ఉండవట!

January 20, 2018


img

మరొక ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రసన్నం చేసుకొని ఆకట్టుకోవడానికి బడ్జెట్ లో తాయిలాలు ప్రకటించడం ఆనవాయితీ. కానీ త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో తాయిలాలు ఉండబోవని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ‘జీ న్యూస్’ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అనేక అంశాలపై తన మనసులో అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు. 

ఎన్నికలు ఉన్నా లేకపోయినా తమ బడ్జెట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే అభివృద్ధి రూపొందిస్తున్నాము తప్ప ఎన్నికలను చూసుకొని కాదని చెప్పారు. కనుక మొదటి బడ్జెట్ ఏవిధంగా ఉంటుందో 5వ బడ్జెట్ కూడా అలాగే ఉంటుందని అన్నారు. 

దేశంలో నిత్యం ఏదో ఒక రాష్ట్రంలోనో లేదా ఏదో ఒక వ్యవస్థకో ఎన్నికలు జరుగుతూనే ఉన్నందున, నిత్యం ఎన్నికల వాతావరణం నెలకొని ఉంటోందని అది సరికాదని ప్రధాని మోడీ అన్నారు. దాని వలన భద్రతా సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు అందరూ ఎన్నికల విధుల నిర్వహణలోనే ఎక్కువ కాలం గడుపవలసి వస్తోందని, ఆ కారణంగా కోట్లాది పనిగంటలు, వేలకోట్ల ప్రజాధనం వృధా అయిపోతున్నాయని అన్నారు. కనుక దేశంలో అన్ని రాష్ట్రాలకు, అన్ని వ్యవస్థలకు (పార్లమెంటు, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీలకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచిదని, అది కూడా ఒక పండుగలాగ జరుపుకోవాలని తాను కోరుకొంటున్నట్లు మోడీ తెలిపారు. రంగులు చల్లుకొన్నా బురద జల్లుకొన్నా అప్పటికే పరిమితమయితే బాగుంటుందని అన్నారు. ఆ తరువాత అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టి పనిచేసుకోగలుగుతారని అన్నారు. 

ఇక నోట్ల రద్దు, జి.ఎస్.టి. అమలుపై తనపై అనేకమంది విమర్శలు చేస్తున్న సంగతి తనకు తెలుసునని, వాటిని పట్టించుకొని అక్కడే ఆగిపోతే, దేశాభివృద్ధి నిలిచిపోతుందని కనుక తాను వాటిని పట్టించుకోకుండా ముందుకే సాగిపోతున్నానని చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎవరూ మెచ్చుకోకపోయినా, విమర్శలు చేయడానికి చాలా మంది ముందుంటారని అన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపట్టిన, సాధించిన అనేక అభివృద్ధి పనుల గురించి ప్రధాని మోడీ వివరించారు. దేశంలో కులరాజకీయాలు పెరగడం చాలా ఆందోళన కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 


Related Post