కత్తి యుద్ధం ముగిసింది...ఆ తరువాత?

January 20, 2018


img

పవన్ కళ్యాణ్ అభిమానులకు సినీ విమర్శకుడు మహేష్ కత్తికి మద్య జరుగుతున్న యుద్ధం నిన్న కోడిగుడ్లదాడి..పోలీస్ కంప్లెయింట్ తో పతాకస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అయితే నిన్న సాయంత్రమే ఊహించని విధంగా ఇరువర్గాల మధ్య రాజీ కుదిరి ‘యుద్దవిరమణ’ ప్రకటన చేశారు.       

ఆంధ్రజ్యోతి స్టూడియోలో ఉన్న మహేష్ కత్తి వద్దకు కొందరు జనసేన నేతలు వచ్చి పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున ఆయనకు క్షమాపణలు చెప్పడంతో అయన రాజీకి సిద్దపడ్డారు. పవన్ కళ్యాణ్ అభిమానులపై ఇచ్చిన పోలీస్ కంప్లెయింట్ ను వాపసు తీసుకోవడానికి అంగీకరించారు. అనంతరం మహేష్ కత్తి, జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కలిసి సెల్ఫీలు తీసుకొని, ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొన్నారు. ఇక నుంచి పవన్ కళ్యాణ్ పై అనుచిత విమర్శలు చేయనని మహేష్ కత్తి వారికి హామీ ఇవ్వగా జనసేన నేతలు కూడా అదేవిధంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

అయితే ‘తిరిగే కాలు..తిట్టే నోరు ఎన్నడూ ఆగవని’ అందరికీ తెలుసు. మహేష్ కత్తి తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం నిలిపివేసినా, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించడం వలననే ఇంత పాపులారిటీ  సంపాదించుకోవడం సాధ్యమైంది కనుక పవన్ కళ్యాణ్ ను ఆయన ‘దూరం’ చేసుకొంటారనుకోలేము. 

అలాగే తమచేత ‘సారీ’ చెప్పించుకొని ఈ యుద్దంలో తమ ‘అజ్ఞాతవాసి’ని ఓడించినందుకు లక్షలాది పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్ కత్తిపై ఆగ్రహం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు కనుక వారు అతనిని విడిచిపెదతారనుకోవడం, అతనిని గౌరవిస్తారనుకోవడం పొరపాటే. ఒకరినొకరు వ్యక్తిగత స్థాయిలో దూషించుకోనేంత వరకు పరిస్థితులు వచ్చిన తరువాత జరిగినవన్నీ మరిచిపోయి ఒకరినొకరు గౌరవించుకోవడానికి ఇదేమీ సినిమా కాదు కనుక త్వరలోనే మళ్ళీ వారి మధ్య కత్తి యుద్దాలు మొదలవవచ్చు. 

ఒకవేళ కాకపోతే, ఈ పాపులారిటీతో రాజకీయాలలోకి ప్రవేశించి పైకి ఎదగాలని కలలుకంటున్న మహేష్ కత్తి, మరొక హీరోతోనో లేక రాజకీయ నాయకుడితోనో కత్తి యుద్దానికి సిద్దపడటం ఖాయం. ఇప్పటికే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు చేశారు కనుక అయన తదుపరి లక్ష్యం కేసీఆరే అయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరోపిస్తున్నట్లు మహేష్ కత్తి వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లయితే, అయన తదుపరి లక్షం చంద్రబాబు నాయుడు కావచ్చు. 


Related Post