ఏపి వెనుకబాటుకు ఎవరిని నిందించాలి?

January 19, 2018


img

తెలుగులో ఒక నానుడి ఉంది. “అత్త కొట్టినందుకు కాదు...తోడికోడలు నవ్వినందుకు ఏడ్చాను” అందిట ఒక కోడలు పిల్ల. ఏపి సిఎం చంద్రబాబు మాటలు కూడా అలాగే ఉన్నాయి. 

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా చితికిపోయిన మాట వాస్తవం. అలాగే కేంద్రంతో బాబు ఎంత సఖ్యతగా, వినయవిధేయతలతో మెలిగినప్పటికీ మోడీ సర్కార్ ఏపిని ఆదుకోలేదన్న మాట కూడా వాస్తవమే. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సాధించుకోలేకపోవడం చంద్రబాబు రాజకీయ వైఫల్యమనే చెప్పక తప్పదు. అలాగే కేంద్రం విదిలించిన నిధులను ఏపి సర్కార్ దుబరా చేసిందని చెప్పక తప్పదు. కేంద్రం ఇచ్చిన సొమ్ముతోనే రాజధాని నిర్మించుకొనే ప్రయత్నం చేయకుండా అట్టహాసంగా అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించడం, వందల కోట్లు ఖర్చు పెట్టి నాలుగు తాత్కాలిక భవనాలను మాత్రమే నిర్మించుకోవడమే అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

రాష్ట్ర ఆర్ధికపరిస్థితి బాగోలేదని తెలిసి ఉన్నప్పుడు వీలైనంత త్వరగా ఉన్నంతలో రాజధానిని ఏర్పాటు చేసుకొని ఉంటే, పెట్టుబడిదారులు వచ్చి ఉండేవారు. కానీ అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మించాలంటూ నాలుగేళ్ళవుతున్నా ఏపికి అసలు రాజధానే లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు. 

కేంద్రం సహకరించనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఆదాయమార్గాలను సృష్టించుకొనేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అందుకు ఏపిలో పుష్కలమైన సహజ వనరులున్నాయి కూడా. కానీ బాబు సర్కార్ ఖర్చులే తప్ప ఆదాయమార్గాలపై దృష్టి పెట్టలేదు. చూస్తూ ఉండగానే నాలుగేళ్ళు గడిచిపోయాయి. మళ్ళీ ఎన్నికలొచ్చేస్తున్నాయి. 

రాజధాని నిర్మాణం మొదలేకాలేదు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మెట్రో రైళ్ళు కాగితాల వద్దే ఆగిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రాష్ట్రానికి పెద్ద పరిశ్రమలు రావడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల ఖర్చులు పెరుగుతున్నాయి. ఉద్యోగుల జీతభత్యాల భారం కూడా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర పరిస్థితి గురించి మోడీ వద్ద బాబు ఎంతగా మొత్తుకొన్నప్పటికీ అయన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదీ ఏపి పరిస్థితి. ఇది ఎవరికైనా చాలా బాధ కలిగించే విషయమే. కానీ రాజకీయ వైఫల్యాలు కొంత, తప్పటడుగులు మరికొంత వెరసి ఈ దుస్థితి ఏర్పడిందని అర్ధం అవుతోంది. 

ఈ నేపధ్యంతో ఉన్న ఏపితో అభివృద్ధిపధంలో దూసుకుపోతున్న తెలంగాణా రాష్ట్రాన్ని పోల్చవద్దన్న ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలను తప్పు పట్టలేము. కానీ ఆ మాటలు చంద్రబాబునే కాదు ఏపి ప్రజల మనసులు కూడా నొప్పించి ఉండవచ్చు. 

నిజమే! ఏపి పరిస్థితిని చూస్తే బాధ కలుగుతోంది. అందుకు రాష్ట్ర విభజనే ప్రధాన కారణం అయ్యుండవచ్చు. కానీ ఆ కారణంగా ఏర్పడిన అన్ని సమస్యలను తన అపారమైన అనుభవంతో, పరిపాలానా దక్షతతో, తనకున్న రాజకీయ, పారిశ్రామిక పరిచయాలతో పరిష్కరించి చూపిస్తానని చంద్రబాబే ఎన్నికల సమయంలో గట్టిగా చెప్పుకొన్నారు. ఆనాడు అయన చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు నేటికీ ఏపిలో అనేక ప్రాంతాలలో గోడలపై కనిపిస్తూనే ఉంటాయి. కనుక ఇప్పుడు కేంద్రాన్నో లేక తెలంగాణా రాష్ట్రన్నో నిందించడం అనవసరం. నేటి ఏపి దుస్థితికి అయన వైఫల్యం కూడా ఒక కారణమని చెప్పక తప్పదు.

ఇక హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారు? తెలుగుజాతి ఉందా లేదా?అనే ప్రశ్నలకు జవాబులు అందరికీ తెలుసు. కనుక వాటి గురించి వాదోపవాదాలు చేసుకోవడం అనవసరమే. చివరిగా ఇద్దరు ముఖ్యమంత్రులను రెండు ప్రశ్నలు అడగవలసిన అవసరం ఉంది. అక్షయపాత్ర వంటి హైదరాబాద్ నగరం లభించకపోయుంటే కెసిఆర్ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగి ఉండేవారా?ఇంత అతిశయం ప్రదర్శించగలిగేవారా? హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసి ప్రపంచ ఐటిపఠంపై పెట్టానని పదేపదే చెప్పుకొంటున్న చంద్రబాబు మరి ఏపికి ఐటి పరిశ్రమలను ఆకర్షించడంలో ఎందుకు విఫలమయ్యారు? ఇంకా ఎన్నేళ్ళు రాష్ట్రవిభజనను సాకుగా చూపుతారు? అనే ప్రశ్నలకు వారిరువురు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలిగితే బాగుంటుంది.


Related Post