సిపిఐ నేతలకు ఇగో ప్రాబ్లెం?

January 19, 2018


img

తెలంగాణాలో సిపిఎం నేతృత్వంలో 28 పార్టీలు కలిసి ‘బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్’ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానిలో సిపిఐను కూడా చేరమని సిపిఎం కోరుతోంది. కానీ సిపిఐ అందుకు అంగీకరించడంలేదు. కారణం ఏమిటంటే, తమను సంప్రదించకుండా సిపిఎం ఫ్రంట్ ఏర్పాటుచేయడమేనని స్పష్టమయింది. హైదరాబాద్ లోని ముఖ్దూం భవన్ లో గురువారం సిపిఐ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దానిలో ఆ పార్టీ నేతలు చెప్పిన మాటలు విన్నప్పుడు వారు ఇగో ప్రాబ్లెం చేతనే సిపిఎం ఏర్పాటు చేసిన ఫ్రంట్ లో చేరలేదని అర్ధం అవుతుంది. 

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి  చాడా వెంకట రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుకు ఇది తగిన సమయం కాదు. ఫ్రంట్ ఏర్పాటు చేసిన సిపిఎం మమ్మల్ని దానిలో చేర్చుకోవడానికి అనుమతిస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. వారు మమ్మల్ని చేర్చుకొనేవారు కాదు మేము చేరేవారం కాదు. ఒక బలమైన రాజకీయ శత్రువును ఎదుర్కోవడానికి అంతకంటే బలమైన ఫ్రంట్ అవసరం. తెలంగాణా కోసం పోరాడిన మేము  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పోరాటాలు కొనసాగించవలసి ఉంటుంది. కనుక రాష్ట్రంలో లౌకికవాద, ప్రజాతంత్ర వామపక్షాలతో కలిసి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తున్నాము. దానిపై చర్చించేందుకు ఈనెల 23వ తేదీన మళ్ళీ మేమందరం సమావేశమవుతాము,” అని అన్నారు.

ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ఇది తగిన సమయం కాదంటూ మళ్ళీ మరో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి చర్చిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అయినా సిపిఐ ఎటువంటి ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొంటోందో సిపిఎం ఇప్పుడు సరిగా అటువంటి ఫ్రంటే ఏర్పాటు చేసింది. కానీ దానిలో చేరడానికి సిపిఐ నేతలకు అహం అడ్డువస్తున్నట్లుంది. అందుకే ఆ ఫ్రంట్ కు పోటీగా సిపిఐ కూడా మరో ఫ్రంట్ ఏర్పాటుకు సిద్దం అవుతున్నట్లుంది. అయితే దాని వలన ప్రజల ఓట్లు ఇంకా ఎక్కువగా చీలిపోతాయి తప్ప సిపిఐ ఆశించిన ప్రయోజనం నెరవేరే అవకాశం ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయినా అహం దెబ్బతిందని పంతానికి పోయి వేరు కుంపటి పెట్టుకొంటే ఎవరికి నష్టం? రాష్ట్రంలో వామపక్షాల ప్రభావం అంతంత మాత్రంగా ఉంది మళ్ళీ వాటిలో అవి కీచులాడుకొంటే ఎవరు వాటికి ఓటేస్తారు?అని ఆలోచిస్తే మంచిదేమో.


Related Post