నాగం చెప్పింది నిజమే...నా?

January 12, 2018


img

త్వరలో భాజపాను వీడబోతున్నట్లు దృవీకరించిన నాగం జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర భాజపా గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. 

“ప్రస్తుతం రాష్ట్ర భాజపాలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. తెరాస సర్కార్ అవినీతికి వ్యతిరేకంగా నేను పోరాడుతుంటే మా పార్టీ నేతలే నాకు సహకరించడం లేదు. కనీసం కేంద్రప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. తెరాసను గట్టిగా డ్డీకొనవలసిన భాజపా దానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. ఈ కారణంగా రాష్ట్రంలో భాజపా తీవ్రంగా నష్టపోతోంది. అయినా ఎవరూ పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కనిపిస్తోంది. ఉగాది తరువాత నేను ఏ పార్టీలో చేరబోయేది చెపుతాను. 2019 ఎన్నికలలో నేను మళ్ళీ నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను. అవే నా చివరి ఎన్నికలు,” అన్నారు నాగం జనార్ధన్ రెడ్డి.        

రాష్ట్ర భాజపా గురించి నాగం చెప్పిన మాటలలో కొంత వాస్తవం ఉందని చెప్పకతప్పదు. రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యమ్నాయం తమ పార్టీయేనని రాష్ట్ర భాజపా నేతలు గొప్పగా చెప్పుకొంటుంటారు కానీ ఆవిధంగా నిలబడటం కోసం వారు చేస్తున్నదేమీ కనబడదు. నాగం చెప్పినట్లుగా కనీసం తెరాస సర్కార్ పై గట్టిగా పోరాటాలు చేయడానికి కూడా వెనుకడతారు. బహుశః తెరాసతో పొత్తుల కోసమే వారు మెతకవైఖరి అవలంభిస్తున్నట్లు అనుమానించక తప్పదు. ఈ అయోమయం, పొత్తుల ఆశల కారణంగా చేజేతులా వారే తమ పార్టీని ఇంకా బలహీనపరుచుకొంటున్నారనిపిస్తుంది. అదే...కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచనలేవీ లేనందునే తెరాస సర్కార్ ను కాంగ్రెస్ నేతలు బలంగా డ్డీ కొంటూ తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలబడగలిగారు. నాగం జనార్ధన్ రెడ్డి చెపుతున్న మాటల సారాంశం ఇదేనని భావించవచ్చు. 


Related Post