సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తిరుగుబాటు!

January 12, 2018


img

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ దీపక్ మిశ్రాకు ఇతర న్యాయమూర్తులకు మద్య చిరకాలంగా సాగుతున్న ‘కోల్డ్ వార్’ నడుస్తున్న సంగతి ఈరోజు బయటపడింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్, జస్టిస్ రంజన్ గొగొయ్‌ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వైఖరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా సుప్రీం కోర్టు పనితీరు దాని ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సాగుతోందని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. ఆ విషయాన్ని తాము సిజెఐ దీపక్ మిశ్రా దృష్టికి తీసుకువెళ్ళినా అయన పట్టించుకోలేదని అందుకే విధిలేని పరిస్థితులలో నేడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడవలసి వస్తోందని అన్నారు. 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే తను ఇతర న్యాయమూర్తుల కంటే అధికుడనని భావించడం సరికాదని అన్నారు. సుప్రీం కోర్టు ప్రస్తుతం నడుస్తున్న తీరుతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమని భావిస్తున్నామని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. నలుగురు న్యాయమూర్తులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇంకా అనేక ఆరోపణలు చేసి అయన వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పులు, నియామకాలు, కేసుల కేటాయింపుల విషయంలో సిజెఐ తీరును వారు తప్పు పట్టారు.   

దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ అప్రమత్తమయ్యి వెంటనే కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ లతో అత్యవసరం సమావేశమయ్యి ఈ వివాదం గురించి చర్చించారు. అనంతరం వేణుగోపాల్ తిరుగుబాటు చేసిన ఆ నలుగురితో సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. 

ఈ వివాదంలో ఇతర న్యాయమూర్తులు కూడా ఎంట్రీ ఇచ్చి కొత్త మలుపు తిప్పారు. అత్యున్నత హోదాలో ఉన్నవారు ఆవిధంగా చేసి ఉండకూడదని జస్టిస్ సోధీ అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులే ట్రేడ్ యూనియన్ నేతల్లాగా గ్రూపులు కట్టి మీడియా ముందుకు వెళ్ళి సిజెఐపై ఇటువంటి విమర్శలు చేయడం చాలా తప్పని, వారి చర్యతో సుప్రీం కోర్టు ప్రతిష్టకు భంగం కలిగింది కనుక ఆ నలుగురిని అభిశంశించాలని జస్టిస్ సోధీ అన్నారు. 

సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ మీడియాతో మాట్లాడుతూ, “సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఆవిధంగా వ్యవహరించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానంపై దేశప్రజలు నమ్మకం కోల్పోయేలా చేశారని, ఇది సుప్రీం కోర్టు చరిత్రలో చీకటి రోజని” అన్నారు. 

సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ, “సిజెఐపై కూడా రాజకీయ ప్రభావం కనబడుతోందని వారి ఆరోపణల ద్వారా తెలుస్తోంది. సిజెఐ తనకున్న అపారమైన అధికారాలను దుర్వినోయోగం చేస్తున్నందునే ఈ విపరీత సమస్య తలెత్తిందని” అన్నారు.  

బహుశః ఇక నేటి నుంచి ఇంకా అనేకమంది న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ సమస్యపై స్పందించవచ్చు. వాటి వలన సుప్రీం కోర్టు ప్రతిష్ట ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. కనుక ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని తక్షణం ఈ సమస్య మరింత పెద్దది కాకుండా అడ్డుకట్టవేయవలసి ఉంటుంది. 


Related Post