సంగీత పోరాటం ఫలించింది

January 12, 2018


img

తెరాస బహిష్కృత నేత పులకండ్ల శ్రీనివాస్ రెడ్డికు మియాపూర్ ఫ్యామిలీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతని భార్య సంగీతకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. బోడుప్పల్ లో సరస్వతీ నగర్ లో ఉన్న అతని ఇంటిని సంగీత వాడుకోవచ్చని, ఆమెకు ప్రతీనెలా రూ.20,000 భరణం చెల్లించాలని ఆదేశించింది. తనకు న్యాయం చేయాలంటూ గత 54 రోజులుగా అతని ఇంటి ముందే ధర్నా చేస్తున్న సంగీత కోర్టు తీర్పు వెలువడిన తరువాత ఆ ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి తన మూడేళ్ళ కుమార్తెతో కలిసి ఆ ఇంటిలోకి ప్రవేశించింది.  

సంగీతను ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, అత్త ఐలమ్మ, మామ బాల్ రెడ్డి కొట్టితిట్టి ఇంటి నుంచి గెంటివేశారు. దాంతో ఆమె తన తల్లి వద్ద ఉంటోంది. ఆమెతో విడాకులు తీసుకోకుండానే శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు. ఈ సంగతి తెలుసుకొన్న సంగీత కుమార్తెతో సహా అతని ఇంటికి చేరుకోగా అతను మళ్ళీ ఆమెను బలవంతంగా బయటకు గెంటేశాడు. ఆమెకు స్థానిక మహిళలు అందరూ అండగా నిలబడటంతో భర్త, అత్తమామలపై మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకొని అతనిని కోర్టులో హాజరుపరచగా శ్రీనివాస్ రెడ్డికి రిమాండ్ విదించింది. రెండు రోజుల క్రితమే అతను బెయిల్ పై బయటకు వచ్చాడు. 

జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత శ్రీన్వివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తనపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకొంటేనే ఆమెను తన ఇంట్లోకి రానిస్తానని చెప్పడం విశేషం. ఈ కేసును విచారిస్తున్న మియాపూర్ ఫ్యామిలీ కోర్టు, ఈరోజు తీర్పు చెపుతూ అతని ఇల్లు సంగీత ఉపయోగించుకోవచ్చని తీర్పు చెప్పింది. గృహహింసకు సంబంధించిన కేసుపై తీర్పు ఇంకా వెలువడవలసి ఉంది. 

గజగజలాడే చలిలో 54 రోజుల పాటు భర్త ఇంటి ముందు కూతురుతో కలిసి సంగీత చేసిన ధర్నాకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపారు. చివరికి ఆమె తొలిపోరాటంలో విజయం సాధించింది. భర్త మోసం చేశాడని నిరాశ నిస్పృహలకులోనయి జీవితం పాడు చేసుకోకుండా, అచంచలమైన ఆత్మస్థైర్యం ప్రదర్శిస్తూ భర్తపై న్యాయపోరాటం చేసి గెలిచిన ధీరమహిళ సంగీతకు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.


Related Post