ఎందుకీ అపాత్రాదానం?

January 11, 2018


img

రాష్ట్రంలో రైతులందరికీ పంట పెట్టుబడిగా ఎకరాకు రూ.4,000 చొప్పున ఈ ఏడాది మే నెల నుంచి ఆర్ధిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సొమ్మును వారికి ఏవిధంగా అందజేయాలనే దానిపై చర్చించి ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల సబ్-కమిటీని ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటుచేశారు. వరుసగా రెండు రోజులు సమావేశమైన ఆ కమిటీ సభ్యులు చెక్ ల ద్వారానే రైతులకు ఆ డబ్బును అందజేయడం మంచిదని నిర్ణయించారు. చెక్ ల పంపిణీలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వాటిని నగదుగా మార్చుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు మొదలైన అన్ని అంశాలపై వారు లోతుగా చర్చించి చక్కటి పరిష్కారాలు కనుగొన్నారు. అయితే, రాష్ట్రంలో పేద ధనిక, సన్నకారు, మోతుబారి రైతు అనే తేడా లేకుండా అందరికీ ఈ ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించడం చాలా విడ్డూరంగా ఉంది. 

నిజంగా అవసరమున్న పేద రైతులకు ప్రభుత్వం ఎంత ఆర్ధికసహాయం అందించినా ఎవరూ వేలెత్తి చూప(లే)రు కానీ వ్యవసాయం చేయిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు,వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, మోతుబారి రైతులకు కూడా ఆర్ధిక సహాయం చేయాలనుకోవడమే ఆక్షేపనీయం. వారికి ఆర్ధిక సహాయం అందిస్తామని చెప్పడం ఎందుకు? మళ్ళీ ఉన్నతాదాయవర్గాలు గ్యాస్ సబ్సిడీని వదులుకొన్నట్లుగా ప్రభుత్వం అందించబోయే ఈ ఆర్ధిక సహాయాన్ని ‘గివ్ ఇట్ అప్' అనే పేరుతో వదులుకోమని వారిని బ్రతిమాలుకోవడం దేనికి? 

ఈ పధకం ప్రధానోద్దేశ్యం పేద రైతులను ఆదుకోవడమే అయితే, ఆర్ధికంగా బాగున్నవారికి ఆర్ధికసహాయం చేయడం ఎందుకు? రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ ఆర్ధిక సహాయాన్ని పంపిణీ చేయాలనుకొన్నప్పుడే ప్రతిపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి. తెరాస నేతలు, కార్యకర్తలకు లబ్ది కలిగించేందుకే తెరాస సర్కార్ ఈ సమితులు, ఆర్ధిక సహాయం ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. వారి ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉంది సబ్ కమిటీ సిఫార్సులున్నాయని చెప్పకతప్పదు. ఈ ‘అపాత్రాదానం’ వలన ప్రభుత్వంపై అదనపు ఆర్ధికభారం పడటం ఖాయం కనుక ఈ పధకం ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ పధకం ఎలా ఉందంటే..అంబానీకి ఆర్ధిక సహాయం అందిస్తానన్నట్లుంది. 


Related Post