కార్పోరేట్ సంస్థలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రెస్ గా మారనుందా?

January 11, 2018


img

దేశంలో శరవేగంగా ఎదుగుతున్న రాష్ట్రాలలో తెలంగాణా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటని ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. దానిని దృవీకరిస్తున్నాయి కార్పోరేట్ కంపెనీలు. ఇదివరకు అంటే 4-5 ఏళ్ళు క్రితం, వ్రేళ్ళ మీద లెక్కించదగ్గ కొన్ని సంస్థలు హైదరాబాద్ నగరంలో 40-50 వేల చ.అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొంటే అదే పెద్ద సంచలన వార్తగా మీడియాలో వచ్చేది. కానీ ఇప్పుడు దేశవిదేశాలకు చెందిన అనేక సంస్థలు హైదరాబాద్ నగరంలో సుమారు లక్ష చదరపు అడుగులు లేదా అంతకు మించిన విస్తీర్ణం కలిగిన కార్యాలయాలను ఏర్పాటు చేసుకొంటున్నాయి. 

ఉదాహరణకు యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు నగరానికి వచ్చిన రెండు మూడేళ్ళలోనే 2.5 లక్షల చా.అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని, ప్రతీ ఏటా ఇంకా కొత్తగా కొనుగోలు చేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థ ‘కుష్ మ్యాన్ అండ్ వెక్ ఫీల్డ్’ అంచనా ప్రకారం వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరంలో కొనుగోలు చేస్తున్న ‘ఆఫీస్ స్పేస్’ ఏటా రెట్టింపు అవుతోంది. 

ఒక్క 2017 సం.లోనే మొత్తం 13 ‘ఆఫీస్ స్పేస్’ కొనుగోలు లావాదేవీలు జరిగాయి. వాటి ద్వారా నగరంలో కొత్తగా మరో లక్ష చ.అడుగుల విస్తీర్ణం గల కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయి. ఇంతవరకు హైదరాబాద్ నగరంలో 36 లక్షల చ.అడుగుల విస్తీర్ణం గల కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయి. దేశంలో మరే మెట్రో నగరం కంటే ఇది చాలా ఎక్కువ. నగరంలో మంచి నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులు కలిగి ఉండటం, ఇతర నగరాలతో పోలిస్తే పెట్టుబడి తక్కువగా ఉండటం, దేశంలో అన్ని ప్రధాననగరాలను, విదేశాలను కలుపుతూ మంచి పౌర రవాణావ్యవస్థ కలిగి ఉండటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అనేక కారణాల వలన కార్పోరేట్ సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలు ఏర్పాటుచేసుకోవడానికి మొగ్గు చూపేలా చేస్తున్నాయి. కార్పోరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయంటే భవిష్యత్ లో హైదరాబాద్ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వాటికి గట్టి నమ్మకం ఉండటమేనని అన్నారు ‘కుష్ మ్యాన్ అండ్ వెక్ ఫీల్డ్’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్.


Related Post