ట్రిపుల్ తలాక్ బిల్లుపై వ్యతిరేకత...దేనికి?

December 28, 2017


img



కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్ సభలో ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు, 2017 (ట్రిపుల్ తలాక్ బిల్లు)ను ప్రవేశపెట్టారు. ఇది ఒక మతానికి, మతాచారాలు, సాంప్రదాయాలకు సంబంధించిన బిల్లు కాదని కేవలం మహిళల హక్కులను కాపాడేందుకు రూపొందించబడిన బిల్లు అని మంత్రి చెప్పారు. 

అయితే ఇది ముస్లిం మహిళలు వారి పిల్లలకు రక్షణ కవచంగా ఏర్పాటు చేస్తున్న బిల్లు అని అందరికీ తెలుసు. కనుక ఇది తమ మతాచారాలలో జోక్యం చేసుకోవడమేనని ముస్లిం మతపెద్దలు, అసదుద్దీన్ ఓవైసీ వంటి ముస్లిం నేతలు వాదిస్తున్నారు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ఎంపి ఓవైసి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉండగా మళ్ళీ ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయనవసరంలేదని వాదించారు. ఈ బిల్లును మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ప్రవేశపెడుతున్నప్పుడు తెరాస సభ్యులు సభనుంచి బయటకు వెళ్ళిపోయారు. తద్వారా ఈ బిల్లుపై తమది తటస్థ వైఖరి అవలంభించబోతున్నట్లు సంకేతం ఇచ్చారని భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఇంకా మరికొన్ని పార్టీల సభ్యులు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 

ఈ బిల్లుకు మద్దతు ఇస్తే ముస్లిం ఓటు బ్యాంకును కోల్పోతామనే భయంతోనే ప్రతిపక్షాలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని వేరేగా చెప్పానవసరం లేదు. అవి తమ రాజకీయ ప్రయోజనాలనే చూసుకొంటున్నాయి తప్ప ఈ సామాజిక దురాచారం కారణంగా దేశంలో లక్షలాది మంది ముస్లిం మహిళలు, వారిపైనే ఆధారపడున్న పిల్లలు రోడ్డున పడి దుర్బర జీవితాలు గడుపుతున్నారని, వారిని ఆదుకోవలసిన బాధ్యత తమపైనే ఉందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. 

లోక్ సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన ఈ రోజునే ఉత్తరప్రదేశ్ లో రాంపూర్ (అవును సినీ నటి జయప్రద ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే) కు చెందిన గుల్ ఆఫ్సాన్ అనే మహిళకు ట్రక్ డ్రైవర్ అయిన ఆమె భర్త ఖాసీం మూడు సార్లు తలాక్ చెప్పేసి వదిలేశాడు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే ఉదయం లేవడం కాస్త ఆలస్యం అయ్యిందిట! వారిరువురు నాలుగేళ్ళు ప్రేమించి, తమ తల్లితండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకొన్నారు. నాలుగేళ్ల వారి ప్రేమ బంధాన్ని ట్రిపుల్ తలాక్ తో ఒక్క నిమిషంలో తెంచేసుకొన్నాడు ఆ భర్త. అయితే అందరూ తమ భార్యల పట్ల ఇంత దుర్మార్గంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని కాదు. ఆవిధంగా వ్యవహరించేవారు ఇటువంటి కుంటిసాకులతో భార్యలకు విడాకులు ఇవ్వకుండా అడ్డుకొని, ముస్లిం మహిళలకు, వారి పిల్లల జీవితాలకు భద్రత కల్పించడమే ఈ బిల్లు ముఖ్యోద్దేశం. కనుక విద్యావంతులైన ముస్లింలందరూ దీనికి మద్దతు ఇస్తే బాగుంటుంది.


Related Post