పాక్ నుంచి అంతకంటే ఏమి ఆశించగలం?

December 28, 2017


img

భారత్ మాజీ నేవీ ఉద్యోగి కులభూషణ్ జాదవ్ తమ దేశంలో గూడచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పాక్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ వేసి అడ్డుపడటంతో అతనికి మరణశిక్ష అమలుకాలేదు. 

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో పాక్ ప్రభుత్వం జైల్లో ఉన్న అతనిని కలిసి మాట్లాడేందుకు అతని తల్లిని, భార్యను అనుమతించింది. తాము కేవలం మానవతాదృక్పధంతోనే వారిని అనుమతిస్తున్నామని గొప్పలు చెప్పుకొన్న పాక్ సర్కార్, అందుకు భిన్నంగా వారిరువురి పట్ల చాలా నీచంగా ప్రవర్తించి తన వక్రబుద్ధిని మరోమారు బయట పెట్టుకొంది. 

వారిరువురినీ చీరలతో లోపలకు వెళ్లేందుకు అనుమతించలేదు. కుర్తా పైజామాలు ధరింపజేశారు. అలాగే వారి బొట్టు, మంగళ సూత్రాలు, గాజులు, మట్టెలు తీయించివేశారు. చివరికి వారు ధరించిన చెప్పులను కూడా తీయించివేశారు. వాటిలో రహస్యంగా కెమెరా లేదా ఆడియో రికార్డర్ ఉన్నట్లుగా తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వాటిని తిరిగి ఇవ్వలేదు. 

అతనిని కలుసుకొనేందుకు వెళుతున్నప్పుడు, మళ్ళీ తిరిగి బయటకు వచ్చినప్పుడు వారిని పాక్ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా జైలు బయట చాలాసేపు నిలబెట్టి పాక్ మీడియాకు అప్పజెప్పడంతో, వారు మహిళలని కూడా చూడకుండా పాక్ మీడియా ప్రతినిధులు వారిరువురిని కాకులు పొడిచినట్లు అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించడం వారు కన్నీళ్లు పెట్టుకొన్నారు. 

ఇంత అవమానం సహించి వారిరువురూ లోపలకు వెళితే అక్కడ కులభూషణ్ జాదవ్ ను నేరుగా కలుసుకోనీయకుండా మద్యలో రెండు గాజు అద్దాలు ఏర్పాటు చేసి ఇంటర్ కం ఫోన్ ద్వారా మాట్లాడించారు. కులభూషణ్ తల్లి తమ మాతృబాష అయిన మరాఠిలో మాట్లాడబోతే ఫోన్ కట్ చేసి తప్పనిసరిగా హిందీలోనే మాట్లాడాలని ఒత్తిడి చేశారు. ఇక కులభూషణ్ జాదవ్ తన తల్లిని, భార్యను చూసి సంతోషించినప్పటికీ అయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు వారదిగిన ప్రశ్నలకు మొక్కుబడిగా సమాధానాలు చెప్పారు. ఆ సమయంలో అతను సాధారణ ఖైదీ దుస్తులలో కాకుండా శరీరం పూర్తిగా కప్పి ఉండేవిధంగా సూట్ ధరించి రావడం అనుమాలకు తావిస్తోంది. 

ఆ ఇద్దరు మహిళల పట్ల పాక్ అధికారులు, మీడియా ప్రవర్తించిన తీరును భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈరోజు రాజ్యసభలో గట్టిగా ఖండించారు. హిందూ సుమంగళి మహిళలైన వారిచేత భర్త బ్రతికి ఉండగానే మంగళ సూత్రాలు, బొట్టు, గాజులు అన్నీ తీయించి ఘోరంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ప్రభుత్వం మానవతాదృక్పధంతో వారికి అనుమతి మంజూరు చేశానని చెప్పుకొని చాలా అమానవీయంగా ప్రవర్తించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా పాక్ తీరును గట్టిగా ఖండించారు. భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి అయితే పాక్ పై దాడి చేసి దానిని ముక్కముక్కలుగా ఖండాలుగా విభజించి దాని పొగరు అణచాలని డిమాండ్ చేశారు. 

అయితే పాక్ ఒక ధూర్తదేశమని దానిది చాలా వక్రబుద్ధి అని తెలిసి ఉన్నప్పుడు దాని నుంచి ఇంతకంటే గొప్పగా ఏమి ఆశించగలము? భారత్ లో వైద్యసహాయం కోరివస్తున్న అనేకమంది పాక్ మహిళలకు, రోగులకు భారత్ చాలా ఉదారంగా సహాయసహకారాలు అందించి తోడ్పడుతుంటుంది. అందుకు వారు పాక్ తిరిగి వెళ్ళిన తరువాత కూడా భారత్ సర్కార్ కు పదేపదే కృతజ్ఞతలు తెలుపుకొంటుంటారు. 

కానీ పాక్ సర్కార్ మాత్రం ఇద్దరు నిస్సహాయులైన భారతీయ మహిళలపై తన ప్రతాపం చూపించి, వారి పట్ల చాలా ఘోరంగా వ్యవహరించింది. అందుకు భారతీయులు అందరూ చాలా బాధపడుతున్నప్పటికీ, పాక్ వక్రబుద్ధి ఎటువంటిదో యావత్ ప్రపంచానికి మరొకమారు తెలిసి వచ్చిందని సరిపెట్టుకోక తప్పదు.

ఇంత నీచానికి ఒడిగట్టిన పాక్ ఇప్పుడు భారత్ సర్కార్, భారత్ మీడియా తమపై విమర్శలు చేస్తునందుకు ప్రతిగా కులభూషణ్ జాదవ్ తల్లి, భార్య ధరించిన చెప్పులలో సీక్రెట్ కెమేరా లేదా మైక్ లను జొప్పించి, వాటిని తాము కనుగొన్నామని మీడియా మందు ప్రదర్శించి మళ్ళీ భారత్ పై బురద జల్లడానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. 


Related Post