తెరాస ఎంపిల ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందా?

December 28, 2017


img

ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ తెరాస ఎంపిలు నిన్న లోక్ సభలో ఆందోళన చేసి సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో వారి ఒత్తిడికి కేంద్రం దిగివచ్చినట్లే ఉంది. ఈరోజు లోక్ సభలో దీనిపై నిర్దిష్టమైన ప్రకటన చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ హామీ ఇచ్చారు. 

ఇదే సమయంలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో తాత్కాలిక భవనాలలో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయడానికి అంగీకరించడం విశేషం. ఏపి హైకోర్టుకు శాశ్విత భవనాలను నిర్మించే వరకు తాత్కాలిక భవనాలలో నిర్వహించాలని నిర్ణయించి, అమరావతి పరిసర ప్రాంతాలలో అందుకు తగిన రెండు మూడు భవనాలను ఖరారు చేసి, ఆ వివరాలను ఏపి అడ్వకేట్ జనరల్ డి. శ్రీనివాస్ ద్వారా గురువారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ కు అందించబోతున్నట్లు తాజా సమాచారం. వాటిని అయన పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాత, సుప్రీం కోర్టు, కేంద్రప్రభుత్వం అనుమతి తీసుకొని హైకోర్టు విభజన ప్రక్రియను ప్రారంభించవచ్చు. 

తెరాస ఎంపిలు లోక్ సభలో ఒత్తిడి చేస్తున్నప్పుడే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం గమనిస్తే, కేంద్రప్రభుత్వం ఆయనపై ఒత్తిడి చేసి ఉండవచ్చు. లేదా రాజధాని నిర్మాణం, మెట్రో రైల్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుతో సహా వేటినీ పూర్తిచేయలేకపోతున్న కారణంగా, ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగితే వచ్చే ఎన్నికలలో నష్టపోయే ప్రమాదం ఉందనే భయంతో, కనీసం హైకోర్టునైనా ఏర్పాటు చేసి చూపించాలనుకొని ఉండవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు ఇదేపని అధికారంలోకి రాగానే చేసి ఉండి ఉంటే, ఆయనకు గౌరవంగా ఉండేది..అందరికీ మేలు కలిగి ఉండేది కదా? ఏది ఏమైనప్పటికీ, మూడున్నరేళ్ళ తరువాత హైకోర్టు విభజనకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. 


Related Post