అవి సంతోషపడటానికి గొప్ప కారణమే దొరికింది కానీ..

December 27, 2017


img



సాధారణంగా ఏ పోటీ లేదా యుద్ధంలోనైనా ఎవరో ఒక్కరే విజేతగా నిలుస్తారు కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు రెండూ విజయం సాధించినట్లు సంతోషపడుతుండటం విశేషం. వరుసగా ఆరవసారి కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చినందుకు భాజపా సంతోషిస్తుంటే, భాజపా కంచుకోటను బ్రద్దలు కొట్టి దానితో ఇంచుమించు సరిసమానంగా సీట్లు గెలుచుకొన్నందుకు కాంగ్రెస్ పార్టీ కూడా విజయం సాధించినట్లే భావించి ఉప్పొంగి పోతోంది. 

విచిత్రమేమిటంటే రెండు పార్టీలు కూడా ఆ ప్రభావం తెలంగాణా రాష్ట్రంపై పడుతుందని, అది తమకు సానుకూల వాతావరణం కల్పిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాయి. మరో గమ్మతైన విషయం ఏమిటంటే రెండు పార్టీలు కూడా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి పెద్దగా మాట్లాడటం లేదు!

మోడీ అవినీతిరహిత, సమర్ధమైన పాలన చూసి దేశంలో అన్ని రాష్ట్రాలు భాజపాను గెలిపిస్తున్నాయని, కనుక 2019 ఎన్నికలలో తెలంగాణా ప్రజలు కూడా భాజపానే తప్పకుండా గెలిపిస్తారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె. లక్ష్మణ్ బల్లగుద్ది వాదిస్తున్నారు.

ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, “గత మూడున్నరేళ్ళుగా ప్రధాని నరేంద్ర మోడీతో సహా మంత్రులు భాజపా ఎంపిలు, నేతలు అందరూ మా పార్టీమీద, మా యూపియే ప్రభుత్వం మీద, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మీద, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద బురద జల్లుతూనే ఉన్నారు. కానీ ఈ మూడున్నరేళ్ళలో వారు ఒక్క ఆరోపణను కూడా నిరూపించి చూపలేకపోయారు. 2జి కుంభకోణంలో అందరూ నిర్దోషులేనని సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు వారికి చెంప దెబ్బవంటిది. కాంగ్రెస్ ప్రభుత్వం మచ్చలేని ప్రభుత్వమని ఆ తీర్పు నిరూపించింది. మాపై మోడీ సర్కార్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ప్రజలు కూడా నమ్మడం లేదని గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. గుజరాత్ ప్రజల తీర్పు భాజపాకు చెంపదెబ్బ వంటిదే. కాంగ్రెస్ పార్టీపై పడిన మచ్చ తొలగిపోవడంతో ఇప్పుడు దేశప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. కనుక 2019 ఎన్నికలలో తెలంగాణా ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే గెలిపించడం ఖాయం,” అని అన్నారు. 

గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణా రాష్ట్రం మీద కూడా ఉంటుందని, అది తమకే అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్, భాజపాలు వాదోపవాదాలు చేసుకోవడం బాగానే ఉంది. కానీ మద్యలో తెరాస దాని అధినేత కెసిఆర్ ప్రభావం గురించి మరిచిపోతే ఎలాగబ్బా? 


Related Post