హైకోర్టు విభజిస్తారా లేదా?

December 27, 2017


img

తెరాస ఎంపిలు ఇవ్వాళ్ళ లోక్ సభలో హైకోర్టు విభజనపై కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. దానికోసం వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపి జితేందర్ రెడ్డి సభలో మాట్లాడుతూ, “పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా కేంద్రం అమలుచేయకుండా జాప్యం చేస్తోంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 42 నెలలు కావస్తోంది. ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయలేదు. హైదరాబాద్ లోనే ఏపికి వేరేగా హైకోర్టును ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన స్థలాన్ని, భవనాలను ఇస్తామని మా ప్రభుత్వం చెప్పినా ఉమ్మడి హైకోర్టును విభజించడానికి కేంద్రం చొరవ చూపడం లేదు. ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి  రాజ్ నాథ్ సింగ్, మాజీ న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ తదితరులు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు హైకోర్టు విభజన జరుగలేదు. ఈ కారణంగా ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో తెలంగాణవారికి చాలా నష్టం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించామని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాశారు కూడా. అయినా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనుక ఇకనైనా హైకోర్టు విభజన చేసి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు ఈ అంశం గురించి సభలో ప్రస్తావిస్తూనే ఉంటాము,” అని కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు.

హైకోర్టు విభజనపై ఏడాది క్రితం రాష్ట్రంలో న్యాయవాదులు, జడ్జీలు రోడ్లేక్కి ధర్నాలు, ర్యాలీలు చేసినప్పుడు రాష్ట్రంలో న్యాయవ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. అప్పుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కలుగజేసుకొని వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు తమ ఆందోళనలను విరమించారు. కానీ నేటికీ హైకోర్టు విభజన జరుగలేదు. హైకోర్టు విభజన జరుగాలంటే అందుకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సహకరించాలి. ఏపిలో హైకోర్టుకు శాశ్విత భవనాలు నిర్మించుకోనేవరకు ఎక్కడైనా తాత్కాలిక భవనాలను హైకోర్టుకు కేటాయించవచ్చు. కానీ తెదేపా, తెరాసల మద్య నెలకొని ఉన్న రాజకీయ విభేధాల కారణంగా అందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదు.

ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించినట్లు హైదరాబాద్ లోనే ఏపి లేదా తెలంగాణా రాష్ట్రాలకు హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు. కానీ దానికి పార్లమెంటులో విభజన చట్టానికి చిన్న  సవరణ చేయవలసి ఉంటుంది. అది కేంద్రం చేతిలో పనే కానీ ఎందుకో అది ఆసక్తి చూపడం లేదు. కనుక చంద్రబాబు సర్కార్ ఏపిలో హైకోర్టు ఏర్పాటు చేసుకొనేవరకు ఉమ్మడి హైకోర్టు కొనసాగక తప్పని పరిస్థితి నెలకొని ఉంది.

ఈ విషయంలో చంద్రబాబును ఒప్పించలేమనుకొన్నట్లయితే, చట్ట సవరణ చేసి  హైదరాబాద్ లోనే ఏపి లేదా తెలంగాణా రాష్ట్రాలకు హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు. కానీ చేయదలచుకోకపోతే ఈ విషయంలో తెలంగాణా రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ సవతితల్లి ప్రేమ చూపుతున్నట్లే భావించవలసి ఉంటుంది. హామీల అమలుచేయడం లేదని తెలంగాణా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్న రాష్ట్ర భాజపా నేతలు, హైకోర్టు విభజన హామీని 42 నెలలు గడిచిపోయినా ఎందుకు అమలుచేయడంలేదని కేంద్రప్రభుత్వాన్ని నిలదీయడం లేదు! 


Related Post