భారత్ కీర్తి ప్రతిష్టలు మారుమ్రోగిన సంవత్సరం: 2017

December 27, 2017


img

ఈ 2017 సంవత్సరం భారత్ కు చాలా మంచిపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ సంబంధాలు, అంతరిక్ష ప్రయోగాలు, క్రీడలు, అందాల పోటీలు, సినీరంగం మొదలైన అనేక రంగాలలో భారత్ కు మంచిపేరు సంపాదించుకొని ప్రపంచదేశాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును గౌరవాన్ని సంపాదించుకొంది.   

భారత్ కు ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఇస్రో దాని ప్రయోగాల గురించే ముందుగా చెప్పుకోవలసి ఉంటుంది. ఈ ఏడాది మొదట్లోనే (ఫిబ్రవరి 15) ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను, మళ్ళీ జూన్ 23వ తేదీన ఒకేసారి 31 ఉపగ్రహాలను    అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి యావత్ ప్రపంచ దేశాలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. జూన్ 5వ తేదీన అత్యంత బరువైన (2230 కేజీలు) ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టి మరోసారి తన సత్తా చాటుకొంది. ఇక మూడేళ్ళ క్రితం మంగళగ్రహంపైకి పంపిన ‘మామ్’ ఉపగ్రహం ఆ గ్రహానికి సంబందించినవిలువైన సమాచారాన్ని, అనేక ఫోటోలను పంపిస్తోంది. ఇప్పటి వరకు అది 700 ఫోటోలను పంపించింది. ఇది ఇస్రో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. ఈ ఏడాదిలో ఆగస్ట్ లో చేసిన పిఎస్ఎల్వి-సి 39 ఒక్కటి తప్ప మొత్తం అన్ని ప్రయోగాలు విజయవంతం అవడంతో ప్రపంచ దేశాలలో ఇస్రో పేరు..దానితో బాటు భారత్ పేరు మారుమ్రోగిపోయింది. 

ఈ ఏడాది క్రీడలలో మహిళలు భారత్ పరువు కాపాడారని చెప్పవచ్చు.  ఈ ఏడాది అక్టోబర్ 5న జపాన్ లో జరిగిన మహిళల ఏసియా కప్ హాకీ పోటీలలో భారత్ టీమ్ చైనాను ఓడించి కప్ గెలుచుకొని వచ్చారు. అలాగే నవంబర్ 1న న్యూ డిల్లీలో జరిగిన టి-20 మ్యాచ్ లో భారత మహిళా క్రికెటర్లు న్యూజిలాండ్ ను ఓడించారు. భారత మహిళా క్రికెట్ టీం మిథాలి రాజ్ కెప్టెన్సీ లో ఇంగ్లాండ్ లో జరిగిన మహిళల వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో  ఫైనల్స్ కు చేరుకొంది కానీ ఇంగ్లాండ్ టీం చేతిలో ఓడిపోయింది. వన్డేపోటీలలో 6,000 పరుగులు తీసిన మహిళా క్రికెటర్ గా రికార్డు నెలకొల్పింది. 

సుమారు 17 సం.ల తరువాత 2017లో హర్యానాకు చెందిన మానుషి చిల్లర్  ‘మిస్ వరల్డ్’ కిరీటం సాధించింది. మిస్ వరల్డ్ సాధించిన భారతీయ వనితలలో ఆమె 6వ వ్యక్తి. 

భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి-2 సినిమా విడుదలైంది 2017లోనే! ఇక తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడం, ముఖ్యంగా అమెరికాలో వందల ధియేటర్లలో తెలుగు సినిమాలు విడుదల చేయడం, విదేశాలలో కూడా తెలుగు సినిమాలు మంచి బిజినెస్ చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆ జోరు మరింత పెరిగి విదేశాలలో సైతం తెలుగు సినిమాలు కలెక్షన్లలో పోటీలు పడుతున్నాయి. ఇక హిందీ సినిమాల సంగతి చెప్పనే అక్కరలేదు. వాటికి మొదటి నుంచి అంతర్జాతీయ మార్కెట్ ఉంది. అది ఈ ఏడాది ఇంకా పెరిగింది. 

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు, ఆ తరువాత వెంటనే జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలతో హైదరాబాద్ పేరు దేశవిదేశాలలో మారుమ్రోగిపోయింది. 


Related Post